గల్వాన్‌ లోయలో మళ్లీ యుద్ధ మేఘాలు

గల్వాన్‌ లోయలో మళ్లీ యుద్ధ మేఘాలు
గల్వాన్‌ లోయలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నిర్మల హిమగిరులు నివురుగప్పిన..

గల్వాన్‌ లోయలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నిర్మల హిమగిరులు నివురుగప్పిన నిప్పును తలపిస్తున్నాయి. చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు భారత్‌ బలగాలు ధీటుగా బదులు ఇవ్వడంతో.. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాంగాంగ్‌ దక్షిణ రేవులో ఇరువర్గాల సైన్యాలు భారీగా మోహరించినట్టు తెలుస్తోంది. యుద్ధ విమానాల చక్కర్లు, భారీ ట్యాంకుల మోహరింపులతో అక్కడ యుద్ధ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు రెండు దేశాల యుద్ధ ట్యాంకులు పరస్పరం దాడిచేసుకునేంత దగ్గరలో ఉన్నాయి. ఇరుదేశాలూ ఎల్‌ఏసీకి ఇరువైపులా లక్ష మంది చొప్పున మోహరించినట్లు సమాచారం. భారీ ట్రక్కులు ఆయుధ సామగ్రిని చేరవేస్తున్నాయి.

గల్వాన్‌ లోయలో రెండున్నర నెలల కిందట చైనా తీసిన దొంగదెబ్బకు భారత్‌ ఇప్పుడు దీటుగా సమాధానం ఇచ్చింది. పాంగాంగ్‌ ఉత్తర రేవును డ్రాగన్‌ ఆక్రమించినందుకు ప్రతీకారంగా ఇప్పుడు దక్షిణ రేవును భారత్‌ తన వశం చేసుకుంది. ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి వేళ దొంగచాటుగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన చైనాకు ఝలక్‌ ఇచ్చింది. ఆ ప్రాంతంలోని కీలక పర్వత శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ఈ ప్రాంతంపై భారత్‌ పూర్తిగా పట్టుబిగించింది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రాగన్‌ కదలికలను విస్పష్టంగా వీక్షించొచ్చు. ఈ చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. కనీసం రెండు పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు పదేపదే విఫలయత్నం చేస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అంతకంతకూ పెంచుతోంది. ఫలితంగా ఇరు దేశాల సైనిక మోహరింపులు ముమ్మరమయ్యాయి. పాంగాంగ్‌ దక్షిణ రేవులో మోహరింపును పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యగా భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఎదురుదాడి ఉద్దేశం కాదని వివరించాయి. ఇక్కడి కీలక చుషుల్‌ లోయలోని భారత భూభాగాన్ని రక్షించుకునేందుకే ఇలా చేశామని తెలిపాయి. ఈ ప్రాంతంలో చైనా కదలికలను పసిగట్టడం వల్ల ఇప్పుడు అక్కడి పర్వత శిఖరాలపై మోహరించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్న చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. సైనిక చర్యలను ముమ్మరం చేసింది. మోల్దో నుంచి భారీగా చైనా ట్యాంకులు, వ్యాన్‌లు ముందుకు కదలడం అరంభించాయి. ఈ బృందంలో 200-500 మంది సైనికులు ఉన్నట్లు అంచనా. అక్కడి ముఖ్యమైన పర్వత శిఖరం 'బ్లాక్‌ టాప్‌'ను చేజిక్కించుకోవాలన్నది డ్రాగన్‌ ఉద్దేశం. దీంతో భారత్‌ అప్రమత్తమైంది. మన సైన్యం కూడా అదే స్థాయిలో టి-72, టి-90 ట్యాంకులను మోహరించింది. అయితే మన బలగాలు కీలక పర్వత శిఖరాలపై మోహరించి ఉండటం, ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణులనూ రంగంలోకి దించడంతో డ్రాగన్‌ బలగాలు ముందడుగు వేయలేకపోయాయి. తాజా చర్యతో కీలకమైన 'స్పాంగుర్‌ గ్యాప్‌' అనే ప్రాంతాన్ని భారత్‌ విస్పష్టంగా పరిశీలించగలుగుతుంది. సమీపంలోని రెజాంగ్‌ లా సహా అనేక కీలక ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను భారత్‌ మోహరించినట్లు మన అధికారులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story