Cricket: దుబాయ్‌లో ఐపీఎల్ వేలం!

Cricket: దుబాయ్‌లో ఐపీఎల్ వేలం!
ఆ దేశంలోనే వేలం ఎందుకంటే..?

భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ఆసక్తికరంగా సాగుతుండగానే బీసీసీఐ మరో మెగా టోర్నీ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ IPL నిర్వహణకుసన్నాహాలు ప్రారంభించింది. ఐపీఎల్ జరిగేది వచ్చే ఏడాది అయినా అత్యంత కీలకమైన వేలం ప్రక్రియ మాత్రం ఈ ఏడాది చివర్లో జరగనుంది. 2024కు సంబంధించిన ఐపీఎల్ వేలం ప్రక్రియ.. డిసెంబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి వేలం ప్రక్రియ భారత్‌లో జరగడం లేదని తెలుస్తోంది. ఆటగాళ్ల వేలం ప్రక్రియను భారత్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి 19 మధ్యలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియ జరగనుంది. గత ఏడాది ఐపీఎల్ వేలం ప్రక్రియ కొచ్చిలో జరిగింది. IPL 2024 వేలం ప్రక్రియను డిసెంబర్ 15 నుంచి 19 మధ్య దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళిక రచిస్తోందని క్రిక్‌బజ్‌ తెలిపింది.


అయితే వేలం ప్రక్రియపై IPL ఫ్రాంచైజీలకు అధికారికంగా బీసీసీఐ ఇంకా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. గత ఏడాది కూడా వేలం ప్రక్రియను ఇస్తాంబుల్‌ నిర్వహించాలని భావించినా చివరికి కొచ్చిలో నిర్వహించారు. ఇప్పుడు కూడా దుబాయ్‌లో నిర్వహించాలన్నది కేవలం ప్రతిపాదన మాత్రమే అని ఈసారి కూడా అది మారే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ ప్రాచుర్యం మరింతగా పెంచేందుకు దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ వ్యూహం రచిస్తోంది. స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తరువాత ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వివరాలు తెలియనున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో మహిళల ఐపీఎల్ వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఐపీఎల్ వేలం ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల వేలం ద్వారా బీసీసీఐ 48 వేల కోట్లు ఆర్జించింది. వన్డే ప్రపంచకప్ ముగిసిన తరువాత వివిధ ప్రాంచైజీ జట్లు రిటైన్ ప్లేయర్ల జాబితా వెలువరించాల్సి ఉంది. ఆ జాబితా ఆధారంగా వేలానికి సిద్ఘంగా ఉన్న ఆటగాళ్లు ఎవరు, ఏ జట్టు వ్యాలెట్ ఎలా ఉందనేది తెలియనుంది.


వేలానికి ముందుగానే ఫ్రాంచైజీలన్నీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లతో పాటు వదిలేసే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ బోర్డుకు అందించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి త్వరలోనే బీసీసీఐ షెడ్యూల్‌ విడుదల చేయనుంది. విలువపరంగా కూడా అంతర్జాతీయంగా ఐపీఎల్‌.. అమెరికాలో జరిగే నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ తర్వాత రెండో స్థానంలో ఉంది. దేశానికి ఒక ఫ్రాంచైజీ లీగ్‌ ఉన్నా బీసీసీఐకి కాసులు కురిపిస్తున్న ఐపీఎల్‌ పరిధిని విశ్వవ్యాప్తం చేయడానికి బీసీసీఐ ఈసారి వేలాన్ని దుబాయ్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. వరల్డ్‌ కప్‌ పనుల్లో బిజీగా ఉన్న బీసీసీఐ.. మెగా టోర్నీ ముగిశాక పూర్తివివరాలను ఫ్రాంచైజీలతో పంచుకునే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story