ఆసియా క్రీడలకు తెర

ఆసియా క్రీడలకు తెర
వైభవంగా ముగింపు వేడుకలు, సత్తాచాటిన భారత ఆటగాళ్లు

ఆసియా క్రీడల సంరంభానికి తెర పడింది. సెప్టెంబర్‌ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు అక్టోబర్‌ 8న వైభవంగా ముగిశాయి. 16 రోజుల పాటు ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. బిగ్‌ లోటస్‌ స్టేడియంలో 75 నిమిషాల పాటు సాగిన ఆసియా క్రీడల ముగింపు వేడుకలు చైనా సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాయి. ముగింపు వేడుకల్లో సాంకేతిక విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని చాటే సాంస్కృతి కార్యక్రమాలు అబ్బురపరిచాయి. లైట్‌, లేజర్‌, సౌండ్‌ షో వీక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. 45 దేశాల అథ్లెట్లు పాల్గొన్న ముగింపు వేడుకలు క్రీడాకారులు సహా అతిథులకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చాయి. చైనా ప్రధాని లి క్వియాంగ్‌, ఇతర అతిథుల సమక్షంలో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్‌ సింగ్‌ 19వ ఆసియా క్రీడలు ముగిసినట్టు ప్రకటించారు. “‘19వ ఆసియా క్రీడలు ముగిశాయి. మూడేళ్ల తర్వాత ఐచి నగోయా (జపాన్‌)లో 20వ ఆసియాడ్‌లో మళ్లీ కలుద్దాం" అని రణధీర్‌ చేసిన ప్రకటనతో స్టేడియం మార్మోగిపోయింది. వచ్చే ఆసియా క్రీడలనూ ఆసియా యువత సోదరభావం, మానవజాతి సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా జరుపుకొంటుందని ఆశిస్తున్నానని రణధీర్‌ అన్నారు.


ముగింపు వేడుకల్లో భారత ఆటగాళ్ల బృందానికి పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ భారత పతాకధారిగా వ్యవహరించాడు. మొత్తం 100 మంది భారత క్రీడాకారులు, అధికారులు పరేడ్‌లో భాగస్వాములయ్యారు. కాగా 45 దేశాలనుంచి 40క్రీడాంశాల్లో మొత్తం 12,407 మంది అథ్లెట్లు పోటీలలో పాల్గొన్నారు.

19వ ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో చైనా 383 పతకాలు సాధించింది. 188 పతకాలతో రెండో స్థానంలో జపాన్‌... 190 పతకాలతో మూడో స్థానంలో దక్షిణ కొరియా నిలిచాయి. ఈ ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ 107 పతకాలతో నాలుగో స్థానంలో సాధించింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో భారత్‌ ఈ ఘనత సాధించింది. తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో సెప్టెటంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌లోని ఐచి రాష్ట్ర రాజధాని నగోయా నగరంలో జరుగుతాయి. ముగింపు వేడుకల్లో 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడలనాటి టార్చ్‌, ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ పతాకాన్ని ఐచి రాష్ట్ర గవర్నర్‌ ఒమురా హిడెకి, నగోయా నగర డిప్యూటీ మేయర్‌ నకాటా హిడియో అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story