ASIA CUP: నేడు నేపాల్‌తో భారత్‌ ఢీ

ASIA CUP: నేడు నేపాల్‌తో భారత్‌ ఢీ
పొంచి ఉన్న వర్షం ముప్పు... రద్దయినా సూపర్‌-4కు టీమిండియా

ఆసియాకప్‌(ASIA CUP)లో నేడు నేపాల్‌తో టీమిండియా(nepal-india) తలపడనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన పోరు వర్షార్పణం కావడంతో ప్రస్తుతం భారత ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే ఉంది. గ్రూప్ -ఏ నుంచి ఇప్పటికే పాకిస్తాన్ 3 పాయింట్లతో సూపర్ -4కు అర్హత సాధించగా మరో స్థానం కోసం భారత్ , నేపాల్ మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే భారత్ -నేపాల్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ పోరులో నెగ్గితే భారత్ నేరుగా సూపర్ -4కు చేరుకుంటుంది. వర్షం కారణంగా ఫలితం తేలకపోయినా టీమిండియా గ్రూప్ -ఏలో రెండో స్థానంలో నిలిచి సూపర్ -4కి చేరుకుంటుంది.పాకిస్తాన్ తో జరిగిన పోరులో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలంకావడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఐతే మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్ , హర్దిక్ పాండ్యా అర్థశతకాలతో సత్తా చాటడంతో భారత్ 266 పరుగులు చేయగలిగింది. పసికూన నేపాల్ పై భారీ విజయం నమోదు చేసి తద్వారా ఆత్మవిశ్వాసంతో సూపర్ -4 దశకు చేరుకోవాలని రోహిత్ సేన కోరుకుంటోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. ఇవాళ వర్షం పడే అవకాశాలే ఎక్కువని వాతావరణ కేంద్రం వెల్లడించింది.


వరుణుడు కరుణించి మ్యాచ్‌ జరిగితే మాత్రం భారత్‌ ప్రధాన బలగం బరిలోకి దిగుతుంది. ఇన్నాళ్లు విశ్రాంతిలో ఉన్న ఆటగాళ్లు తప్పకుండా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం ఆడతారు. పైగా గత మ్యాచ్‌లో రోహిత్, శుబ్‌మన్, కోహ్లిలతో కూడిన టాపార్డర్‌ పెద్దగా రాణించలేదు. ఇప్పుడు ఏ చాన్స్‌ తీసుకోకుండా స్టార్‌ ఆటగాళ్లంతా నేపాల్‌తో ఆడతారని తెలుస్తోంది.


పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఇవాళ జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా అతడు శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చాడు. తన భార్య సంజన ప్రసవ తేదీ దగ్గరకు రావడంతో పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్వదేశానికి చేరుకున్నాడు. భారత్‌ సూపర్‌–4 మ్యాచ్‌లకల్లా బుమ్రా తిరిగి లంక చేరుకుంటాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన బుమ్రా అక్కడి నుంచి నేరుగా శ్రీలంక చేరుకున్నాడు. అయితే, బుమ్రా భారత్‌కు వచ్చిన విషయం గురించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అక్టోబరు, నవంబరులో ప్రపంచకప్‌ ఉన్నందున ఆసియా కప్‌లో బుమ్రాను పెద్ద జట్లతో జరిగే మ్యాచ్‌ల్లోనే ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేపాల్‌తో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story