World Cup 2023: ప్రపంచకప్‌ జట్టు ఇదే..

World Cup 2023: ప్రపంచకప్‌ జట్టు ఇదే..
తిలక్‌వర్మ, సంజు శాంసన్‌కు దక్కని చోటు.... స్థానం దక్కించుకున్న కె.ఎల్‌.రాహుల్‌... సారధిగా రోహిత్‌..

అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, హర్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా 15 మందితో కూడిన టీమిండియాను ఎంపిక చేసింది. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లకు జట్టులో చోటు కల్పించారు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌తోపాటు KL రాహుల్‌ను కూడా వికెట్‌ కీపర్లుగా జట్టుకు ఎంపిక చేశారు. ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు నిలుపుకున్నాడు.


సీనియర్ స్టార్ పేసర్ బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. మహమ్మద్‌ షమీ, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బూమ్రాతో పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే మిగలగా, కుల్‌దీప్‌ యాదవ్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా తీసుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, పేసర్‌ ప్రసిధ్ కృష్ణతోపాటు వికెట్ కీపర్‌ సంజు శాంసన్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో అవకాశం దక్కలేదు.


ఈ ప్రొవిజినల్‌ జట్టే ఫైనల్‌ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కుండబద్దలు కొట్టాడు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశాడు.


ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్‌ ప్రపంచ కప్‌ జర్నీని ప్రారంభించనుంది. 12 ఏళ్ల తర్వాత భారత్‌ వరల్డ్‌కప్‌కు అతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రిలిమనరీ జట్లను ప్రకటించాయి.టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ తదితర పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

ప్రపంచకప్‌నకు భారత జట్టు:

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్థూల్‌ ఠాకూర్‌.

Tags

Read MoreRead Less
Next Story