Padma shri :రోహన్ బొపన్నకు పద్మశ్రీ.. ప్రతిభకు గుర్తింపు

Padma shri :రోహన్ బొపన్నకు పద్మశ్రీ.. ప్రతిభకు గుర్తింపు

అభిరుచి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండాలని, ధైర్యాన్ని కోల్పోకూడదని, నిండు మనసుతో దృఢంగా నిలబడాలని, ఎందుకంటే అదృష్టం ఎప్పుడైనా మారవచ్చని, కొందరి జీవితాలు నేర్పిస్తాయి. వేల ,లక్షల మంది ఆటగాళ్ళు ఉన్న ఏ ఆటకైనా ఇది చాలా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే.. ఎందరో ప్రయత్నాలు చేసినా.. కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. అయినా సరే ఏదో ఒక రోజు పెద్ద స్థానం సాధించాలనే ఆశతో చాలా మంది ఆటగాళ్లు పోటీలో ఉంటారు. భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న (Rohan Bopanna) దీనికి తాజా ఉదాహరణ. సుదీర్ఘంగా క్రీడాకారుడిగా ఉండి.. ఎంతో ప్రతిభ కనపర్చిన ఇతనికి ఇప్పుడు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది. బొపన్నకు భారత ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు పద్మ అవార్డుకు ఎంపికైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది, ఇందులో క్రీడా ప్రపంచంలోని 7 మంది ప్రముఖులు కూడా ఉన్నారు. పాపులారిటీ ప్రకారం, ఇందులో బాగా తెలిసిన పేరు రోహన్ బోపన్న. 43 ఏళ్ల బోపన్న టెన్నిస్ కోర్టులో సాధించిన విజయాలకు గానూ ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. బోపన్నకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

43 ఏళ్ల వయసులో రికార్డు..

పురుషుల, మిక్స్‌డ్‌ డబుల్స్‌ దిగ్గజం బోపన్నకు ఈ ఘనత రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. రెండు రోజుల క్రితమే బోపన్న తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆఫ్ ది ఇయర్ పురుషుల డబుల్స్ ఫైనల్‌కు చేరాడు. బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి తొలిసారిగా ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌కు చేరుకోవడంతో, బోపన్న తన ప్రొఫెషనల్ కెరీర్‌లో తొలిసారి డబుల్స్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్‌కు చేరుకున్నాడు. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌ చరిత్రలో నంబర్‌-1 ర్యాంక్‌కు చేరిన అతి పెద్ద వయస్కుడిగా కూడా నిలిచాడు.

బోపన్న 2003లో తన వృత్తిపరమైన అరంగేట్రం చేసాడు. చాలా మంది భారతీయ ఆటగాళ్ళ లానే, సింగిల్స్‌లో విజయవంతం కాకపోవడంతో, అతను డబుల్స్ వైపు మొగ్గు చూపాడు. మహేష్ భూపతి ,లియాండర్ పేస్ విజయాల మధ్య, బోపన్న పెద్దగా చర్చకు రాలేదు కానీ అతను నిలకడగా రాణిస్తూ వచ్చాడు. గత 20 ఏళ్లలో, బోపన్న 1000 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 25 టైటిళ్లను గెలుచుకున్నాడు. ఇప్పుడు నెంబర్ 1 ర్యాంక్‌తో పాటు దేశం నుంచి గొప్ప గౌరవాన్ని కూడా పొందాడు.

నిరీక్షణకు ఇక తెర?

ఈ వారం శనివారం భారత దిగ్గజానికి మరింత అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాడు. జనవరి 27, శనివారం జరిగే ఈ టైటిల్ మ్యాచ్‌లో గెలిస్తే పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా కూడా అవతరిస్తాడు. బోపన్న తన కెరీర్‌లో ఇప్పటివరకు పురుషుల డబుల్స్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవలేదు. అటువంటి పరిస్థితిలో, ఈ గౌరవం నుంచి ప్రేరణ పొందిన బోపన్న ఈ నిరీక్షణను కూడా ముగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story