Shane Warne: లిక్విడ్ డైటే 'షేన్ వార్న్' ప్రాణాలు తీసిందా!! .. అసలేంటీ డైట్..

Shane Warne: లిక్విడ్ డైటే షేన్ వార్న్ ప్రాణాలు తీసిందా!! .. అసలేంటీ డైట్..
Shane Warne: వార్న్ 14 రోజుల పాటు ఘన పదార్ధాలు ముట్టకుండా, ద్రవ రూపంలో ఉన్న ఆహారం మత్రమే తీసుకున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Shane Warne: 52 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్రికెటర్ గుండెపోటుతో చనిపోయాడని డాక్లర్లు నిర్ధారించారు. కానీ ఇప్పుడు, అతని అకాల మరణం తర్వాత కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వార్న్ 14 రోజుల పాటు ఘన పదార్ధాలు ముట్టకుండా, ద్రవ రూపంలో ఉన్న ఆహారం మత్రమే తీసుకున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇది అతడి హఠాన్మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చు. మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్.. వార్న్ బరువు తగ్గడం కోసం విపరీతంగా డైటింగ్ చేసేవాడని.. అందులో భాగంగానే ద్రవ ఆహారాన్ని తీసుకునేవాడని చెప్పారు.

మొదట్లో 14 రోజులు మాత్రమే ద్రవాలు తీసుకునేవాడు. గతంలో కూడా మూడు నాలుగు సార్లు లిక్విడ్ డైట్ చేసాడు. ఆహారంలో వెన్నతో చేసిన తెల్లటి బన్స్, సగ్గుబియ్యంతో చేసిన ద్రవం, ఆకుపచ్చ కూరగాయలతో చేసిన రసాలు తీసుకునేవాడు. వార్న్ కుమారుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. అతని తండ్రి క్రమం తప్పకుండా "30-రోజులు లిక్విడ్ డైట్'' లో ఉన్నాడని తెలిపాడు.


లిక్విడ్ డైట్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

అతని అకాల మరణం వెనుక వార్న్ ఆహారపుటలవాట్లు కారణమని రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, ఆరోగ్య నిపుణులు ఇటువంటి విపరీతమైన ఆహారాలు అనుసరించడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. హార్ట్ ఫౌండేషన్ ప్రధాన వైద్య సలహాదారు ప్రొఫెసర్ గ్యారీ జెన్నింగ్స్ మాట్లాడుతూ, కొన్ని పరిస్థితులలో, తక్కువ కేలరీల ఆహారాలు గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయని అవి గుండె పనితీరు ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. శరీరం యొక్క జీవక్రియ విధానం పూర్తిగా దెబ్బతింటుందని, అది గుండె పని తీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.

ద్రవ ఆహారం శరీరానికి కావలసిన ప్రాథమిక పోషకాలను అందించదని నిపుణులు అభిప్రాయపడ్డారు. తక్కువ కేలరీలు ఉన్న ఆహారంలో విటమిన్లు, కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ సరైన సమతుల్యతను కలిగి ఉండవు. కాబట్టి బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా ఏదైనా డైట్ అనుసరించాలనుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. ఎక్కడో చదివి, విన్నవాటిని అనుసరించి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మీ శరీర బరువును, మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్యులు సూచించిన మేరకు నడుచుకోవాలి అని చెబుతున్నారు.

గర్భిణీ స్త్రీలు, మధుమేహంతో బాధపడుతున్నవారు, ఇన్సులిన్ తీసుకుంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.

Tags

Read MoreRead Less
Next Story