Paralympics: అచ్చొచ్చిన పారా బ్యాడ్మింటన్‌.. ఆఖరి పంచ్ అదిరింది

Paralympics: అచ్చొచ్చిన పారా బ్యాడ్మింటన్‌.. ఆఖరి పంచ్ అదిరింది
టోక్యోకు వచ్చేసరికి మన పారా అథ్లెట్లు మహాద్బుతం చేశారు. ఏకంగా 19 పతకాలతో చరిత్ర సృష్టించారు.

Paralympics: చరిత్రలో ఎప్పుడూ లేదు.. ఇంత మంచి పెర్ఫామెన్స్. 1968లో మొదలుపెడితే.. 2016 వరకు మనం గెలిచింది 12 మెడల్సే. టోక్యోకు వచ్చేసరికి మన పారా అథ్లెట్లు మహాద్బుతం చేశారు. ఏకంగా 19 పతకాలతో చరిత్ర సృష్టించారు. వెటరన్లు మెరిసిన చోట.. కుర్రాళ్లు స్వర్ణాభిషేకం చేశారు. యావత్ దేశాన్ని మురిపించారు. ఓవరాల్‌గా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పతకాల వేటలో.. భారత్ ఆఖరి పంచ్ కూడా అదరింది. అచ్చొచ్చిన పారా బ్యాడ్మింటన్‌లో రెండో గోల్డ్‌తో పాటు సిల్వర్‌తో అదరహో అనిపించింది.

ఎనిమిదేళ్ల జపాన్‌ శ్రమ వృథా కాలేదు. నాడు ఆతిథ్య హక్కులు పొందిన రాజధాని (టోక్యో) నేడు హ్యాపీగా ముగించేంత వరకు... చేసిన కసరత్తు, పడిన శ్రమ, వెచ్చించిన వ్యయం, కట్టుదిట్టంగా రూపొందించిన నియమావళి, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కుదిరాయి. మాటు వేసిన మహమ్మారిని జయించి మరీ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ భేషుగ్గా జరిగాయి. భళారే అన్నట్లుగా ముగిశాయి. ప్రేక్షకులు లేని లోటు ఉన్నా.. ఆటగాళ్లకు, అధికారులకు ఏ లోటు లేకుండా జపాన్‌ పకడ్బందీగా పనులు చక్కబెట్టిన తీరుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్‌ కమిటీ (ఐపీసీ), ప్రపంచ క్రీడా సమాఖ్యలు ఫిదా అయ్యాయి. టోక్యోకు జయహో అన్నాయి.

ఇక ఒలింపిక్‌ టార్చ్‌ చలో చలోమని పారిస్‌ (2024) బాట పట్టింది. ఇంకో మూడేళ్లే ఉన్న తదుపరి ఒలింపిక్స్‌ కోసం ఫ్రాన్స్‌ ఏర్పాట్లలో తలమునకలైంది. మొత్తం 162 దేశాలు పాల్గొన్న టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించింది. 124 పతకాలతో బ్రిటన్‌ 41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా 37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి.

తదుపరి పారాలింపిక్స్‌ 2024లో పారిస్‌లో జరుగుతాయి. ఆ రంభం నుంచి పతకాల వేటలో దూసుకెళ్లిన భారత్‌.. పారాలింపిక్స్‌ను ఘనంగా ముగించింది. తొలిసారి ఈ క్రీడల్లో ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్‌లో మనవాళ్లు అదరగొట్టారు. పోటీల ఆఖరి రోజైన ఆదివారం పారా షట్లర్లు మరో రెండు పతకాలను ఖాతాలో వేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6 విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన కృష్ణ నాగర్‌ దేశానికి అయిదో స్వర్ణాన్ని అందించాడు. ఫైనల్లో అతను చూ మన్‌ హాంకాంగ్‌ పై విజయం సాధించాడు.

తొలి గేమ్‌లో ఓ దశలో 16-11తో వెనకబడ్డ కృష్ణ.. గొప్పగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15-16తో ప్రత్యర్థిని సమీపించాడు. 15-17తో ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రతిఘటించిన ప్రత్యర్థి.. పైచేయి సాధించాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కృష్ణ 13-8తో విజయం దిశగా దూసుకెళ్లాడు. కానీ అనవసర తప్పిదాలతో మధ్యలో తడబడ్డా చివర్లో ఒత్తిడిని దాటి ఛాంపియన్‌గా నిలిచాడు.

Tags

Read MoreRead Less
Next Story