అవనికి స్ఫూర్తి "అభినవ్ బింద్రా ఆత్మకథ"

అవనికి స్ఫూర్తి అభినవ్ బింద్రా ఆత్మకథ
టోక్యో పారాలింపిక్స్‌లో సోమవారం అవని లేఖరా రికార్డు సృష్టించింది. ఆమె పారాలింపిక్స్ పతకం సాధించిన మొదటి భారతీయ షూటర్‌

టోక్యో పారాలింపిక్స్ అవని లేఖరా స్వర్ణం గెలుచుకున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. టోక్యో పారాలింపిక్స్‌లో సోమవారం అవని లేఖరా రికార్డు సృష్టించింది. ఆమె పారాలింపిక్స్ పతకం సాధించిన మొదటి భారతీయ షూటర్‌గా మాత్రమే కాకుండా, దేశ చరిత్రలో పారాలింపిక్స్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా కూడా గుర్తింపు పొందింది.

19 ఏళ్ల అవని లేఖరా R2 మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఫైనల్లో 249.6 తో కొత్త పారాలింపిక్స్ రికార్డును సాధించింది. 2012 లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. దాంతో అనేక సర్జరీలు చేసినా చక్రాల కుర్చీకే ఆమె జీవితం పరిమితమైంది. తండ్రి ఓ రోజు ఆమెను షూటింగ్, ఆర్చరీ రెండింటినీ పరిచయం చేశారు. అభినవ్ బింద్రా ఆత్మకథ పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు. అతడి ఆత్మకథ చదివి స్ఫూర్తి పొందిన అవని 2015లో షూటింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. షూటింగ్‌లో తన మార్కును చూపించాలనుకుంది. అందుకోసం పగలు, రాత్రి సాధన చేసింది.

ఆమె కష్టం ఫలించింది. కల నెరవేరింది. పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి తోటి క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచింది. పసిడి పతకాన్ని సాధించిన అవనిని అభినద్ బింద్రా అభినందించారు.

"గోల్డ్ ఇట్! షూటింగులో భారతదేశానికి మొదటి పారాలింపిక్ స్వర్ణ పతకం సాధించేందుకు @AvaniLekhara అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. చాలా గర్వంగా ఉంది! చరిత్రలో మీ షాట్‌కి చాలా అభినందనలు" అని బింద్రా ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖరా బంగారు పతకాన్ని గెలుచుకున్న క్షణం "భారత క్రీడాకారులకు నిజంగా ప్రత్యేకమైన క్షణం" అని పేర్కొన్నారు. "అద్భుత ప్రదర్శన @అవనిలేఖరా! కష్టపడి బంగారు పతకాన్ని గెలుచుకున్నందుకు అభినందనలు. మీ శ్రమ, షూటింగ్ పట్ల ఉన్న మక్కువ కారణంగా ఇది సాధ్యమైంది. ఇది నిజంగా భారతీయ క్రీడలకు ప్రత్యేక క్షణం. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు," అని పీఎం మోదీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story