అకాల వర్షం..అన్నదాత ఆగమాగం

అకాల వర్షం..అన్నదాత ఆగమాగం
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. పంట చేతికొచ్చే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం పడటంతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. దీంతో ఆరుగాలం కష్టపడ్డ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. దుక్కి దున్ని మొదలు.. పంట చేతికి వచ్చే దాక చంటిబిడ్డలా కాపాడుకున్న పంట వర్షానికి పాడైపోవడంతో ఆ రైతులు రోదిస్తున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో నిన్ని రాత్రి కురిసిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు నెలకొరగగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. నిన్న ఒక్క రోజే సుమారు 50 వేల పై చిలుకు బస్తాలు రావడంతో ధాన్యం కాంటా వేయడం ఆలస్యం అయ్యింది. దీంతో రైతుల ధాన్యం కుప్పలు అలాగే ఉండటంతో కాంటా వేసిన బస్తాలు సహా ధాన్యం రాశుల కిందకు వర్షం నీరు చేరి తడిసిపోయాయి. అధికారుల తీరు వల్లే ఇలా జరిగిందని అన్నధాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వ్యవసాయ మార్కెట్లలోని ఐకెపి సెంటర్లలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు వరద నీరులో ధ్యానం కొట్టుకుపోయింది. ముందస్తుగా టార్పాలిన్లు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనూ రైతులకు కష్టాలు తప్ప లేదు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లోని వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. భారీ గాలివాన రావడంతో.. ధాన్యం రాసుల మీద వేసిన తార్పలిన్ పట్టాలు ఎగిరిపోయాయి. దీంతోధాన్యం తడిసిపోవడమే గాక.. ఆ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆరు గాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో.. అన్నదాతలు కన్నీరు మున్నీరౌతున్నారు.

ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోను అన్నదాతలను అకాల వర్షం ఆగం చేసింది. చిప్పలుతుర్తి, రెడ్డిపల్లి, జనకంపేట, జక్కపల్లి, తునికి గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అటు వరంగల్ జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అకాల వర్షానికి పలు పంటలు నేలరాలాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా బావోజి గూడెంలో పిడుగు పాటుకు శ్రీను అనే రైతు మృతి చెందాడు.

Tags

Read MoreRead Less
Next Story