CONGRESS: అధికారంలో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు

CONGRESS: అధికారంలో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు
మిషన్‌ 15 సాధించాలని కేసీ వేణుగోపాల్‌ దిశానిర్దేశం... బీఆర్‌ఎస్‌ బలహీన పడింది బీజేపీపైనే ఎక్కువగా పోరాడాలని సూచన

తెలంగాణలో అధికారంలోకి ఉన్నామని లోక్‌సభ ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని A.I.C.C సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. మిషన్‌-15లక్ష్యం నిర్దేశించుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ బలహీన పడిందని...బీజేపీపైనే ఎక్కువగా పోరాడాలని సూచించారు. ఉత్తరాదిన బీజేపీ బలహీన పడిందని అందువల్లే దక్షిణ భారత్‌పై దృష్టిపెట్టిందని ఇక్కడా అవకాశం ఇవ్వొద్దని తెలిపారు. శంషాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో A.I.C.C సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్‌మున్సీ, AICC ఇన్‌ఛార్జీ కార్యదర్శులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, లోక్‌సభ అభ్యర్థులు పాల్గొన్నారు.


తొలుత 17 పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశమైన వేణుగోపాల్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్య నాయకులకు వారి వారి నియోజకవర్గాల్లోని ప్రచార పురోగతి, పార్టీ స్థితిగతుల్ని వివరించారు. పార్టీ అధికారంలో ఉందనే కారణంతో... కొందరు నాయకులు నిర్లక్ష్యంతో ఉన్నట్లుగా అధినాయకత్వం గుర్తించినట్లు K.C.వేణుగోపాల్ తెలిపారు. నేతలు తమ వైఖరి మార్చుకోకుంటే.... పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెలరోజుల పాటు పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి మిషన్-15లో భాగంగా 15లోక్‌సభ స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు.

బీఆర్‌ఎస్‌ పూర్తిగా బలహీన పడిందని ఆ పార్టీపై ఎక్కువగా దృష్టి పెట్టొద్దని.... భాజపాపైనే పోరాటాలని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి చేరేవారికి కొందరు D.C.C అధ్యక్షులు ఎందుకు అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏ స్థాయి నాయకులైనా పార్టీలో చేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆటంకాలు కలిగిస్తే... భాజపాలో చేరి ఆ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలుంటే సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగా పుంజుకుందన్న వేణుగోపాల్‌.. ఉత్తర భారతదేశంలో భాజపా ప్రభావం తగ్గిందని తెలిపారు. ఇందుకోసమే దక్షిణ భారత్‌ వైపు బీజేపీ దృష్టి సారించిందని ఇక్కడా అవకాశం ఇవ్వొద్దని దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే... న్యాయ్‌ మ్యానిఫెస్టో సహా రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేణుగోపాల్‌ సూచించారు. గత భారాస సర్కార్‌ అక్రమాలను ప్రజలోకి తీసుకెళ్లాలని వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని... అవకాశం ఉన్న మేరకు రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.. నేతలంతా కష్టపడి పనిచేస్తే.... 15సీట్లు గెలుస్తామని సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాలుగునెలలుగా రాష్ట్రప్రభుత్వం అమలుచేసిన ఆరుగ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థుల విజయం కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు 24 గంటల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్‌ తెలిపినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story