BRS: నేటితో ముగియనున్న బీఆర్‌ఎస్‌ సమావేశాలు

BRS: నేటితో ముగియనున్న బీఆర్‌ఎస్‌ సమావేశాలు
లోక్‌సభ సన్నాహాక భేటీలకు ఇవాళ్టీతో ముగింపు.... కార్యకర్తల అభిప్రాయాలు సేకరణ

భారత రాష్ట్ర సమితి లోక్‌సభ సన్నాహక సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓటమిని సమీక్షిస్తూనే... పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై పార్టీ దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాల సేకరణతోపాటు సూచనలు స్వీకరిస్తున్నారు. వాటన్నింటిని క్రోడీకరించిన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, శిక్షణా తరగతులు నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. త్వరలోనే బూత్ స్థాయి మొదలు పార్టీ పొలిట్‌బ్యూరో వరకు కొత్త కమిటీలు ఏర్పాటు కానున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితి సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు కొనసాగిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది.


ఈనెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన సన్నాహక సమావేశాలు రెండు విడతలుగా జరగుతున్నాయి. ఇవాళ నల్గొండ నియోజకవర్గ భేటీతో సమీక్షలు ముగియనున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి దాదాపుగా వంద చొప్పున ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలు, ఇతర కార్యకర్తలను సమావేశాలకు ఆహ్వానించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTRతోపాటు సీనియర్ నేతలు హరీష్ రావు, కేశవరావు, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి వారితో సమావేశమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను తెలుసుకుంటూనే భవిష్యత్ కార్యాచరణపై సమావేశాల్లో దృష్టి సారిస్తున్నారు.


ముఖ్య నేతలతోపాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించడంతోపాటు సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న అంశమే ప్రతి సమావేశంలోనూ ప్రధానంగా వ్యక్తమవుతోంది. అధికారాన్ని అనుభవించిన నేతలు... క్షేత్రస్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కమిటీలు కేవలం నామామాత్రంగానే తయారయ్యాయని... పూర్తిగా ఎమ్మెల్యే కేంద్రంగా కార్యకలాపాలు సాగడం వల్ల... తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.

ఆదివారం మల్కాజ్‌గిరి నియోజకవర్గ సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రభుగుప్తా, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మణెమ్మ చేసిన ప్రసంగాలు నేతలను ఆకట్టుకున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌లు అల్లుళ్ల పాత్రకు పరిమితం కారాదని అన్నారు. అధికారం, బాధ్యతలు అప్పగిస్తున్న అధిష్ఠానం... ఆ ఇంఛార్జులు పనిచేస్తున్నారో..లేదో..చూడాలని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు భారాస నాయకత్వం సిద్ధమవుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లాలో రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం నిర్వహించి.. శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story