KCR: మళ్లీ రంగంలోకి కేసీఆర్‌

KCR: మళ్లీ రంగంలోకి కేసీఆర్‌
సన్నాహక సమావేశాల్లో అభిప్రాయాలను అధ్యయనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత

పార్లమెంట్‌ సన్నాహక సమావేశాల్లో నేతలు, శ్రేణుల నుంచి వస్తున్న అభిప్రాయాలు, సూచనలను భారత రాష్ట్ర సమితి అధినేత KCR అధ్యయనం చేస్తున్నారు. అభిప్రాయాలను చదువుతున్న ఆయన.. కొందరితో ఫోన్‌లో మాట్లాడారు. విశ్రాంతిలో ఉన్న KCR ఎప్పటికప్పుడు నాయకుల ద్వారా సన్నాహక సమావేశాల తీరును తెలుసుకుంటున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్‌.. త్వరలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాలను పటిష్టం చేసే కార్యాచరణ అమలు చేయనుంది.


హ్యాట్రిక్ పై కన్నేసి ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి.. లోక్‌సభ ఎన్నికల కసరత్తు కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా సన్నాహక సమావేశాలకు వస్తున్నారు. ముఖ్యనేతలు వారికి దిశానిర్ధేశం చేయడంతో పాటు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ భోజన విరామం అనంతరం వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఒక్కో సమావేశంలో 20 నుంచి 40 మంది వరకు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ప్రధానంగా కార్యకర్తలు, ఉద్యమంలో కలిసి తిరిగిన వారిని అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ది నేరుగా అందిస్తుండడంతో పార్టీ, కార్యకర్తల ప్రమేయం లేకుండా పోయిందని అంటున్నారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. వేదికపై కూర్చొన్న కొందరు నేతలు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రెండు పడకల గదుల ఇళ్లు.. ఆశించిన మేర ఇవ్వకపోవడం, రుణమాఫీ అమలు జరగకపోవడంతో పాటు దళితబంధు, BC బంధు లాంటి పథకాలు నష్టం చేశాయని నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో చేసిన పనులను సరిగ్గా చెప్పుకోపోవడం... ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం, పార్టీలోని గ్రూపు తగాదాలు ఓటమికి దారి తీశాయని అంటున్నారు. కొందరికే అన్ని పదవులు ఇవ్వడం ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. నేరుగా అభిప్రాయాలు చెప్పిన వారు కాకుండా మిగతా వారి నుంచి లిఖిత పూర్వకంగానూ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. కొన్నింటిపై KTR, హరీష్ రావు సహా సీనియర్ నేతలు అక్కడే స్పందిస్తున్నారు. అందులో భాగంగానే చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని... ఇక నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్తున్నారు. నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న అభిప్రాయాలు, సూచనలను పార్టీ అధినేత KCR అధ్యయనం చేస్తున్నారు. లోక్‌సభ సన్నాహక సమావేశాలు జరుగుతున్న తీరును నిశితంగా గమనిస్తున్నారు. విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు సీనియర్లకు ఫోన్ చేసి ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది వచ్చారు.. ఫలానా వ్యక్తి హాజరయ్యారా... ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయని ఆరా తీస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో వస్తున్న అభిప్రాయాలు, సూచనలను KCRకు ప్రతిరోజూ నివేదిస్తున్నారు. ఆయన వాటిని చదువుతున్నారు. అభిప్రాయాలు, సూచనలు చేసిన కొందరు నేతలతో ఫోన్లోనూ మాట్లాడారు.

Tags

Read MoreRead Less
Next Story