GADDAR: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన

GADDAR: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన
నందీ అవార్డుల స్థానంలో ఇక గద్దర్‌ అవార్టులు....సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో సభలో ఉద్వేగపూరిత వాతావరణం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన మహనీయుల్లో గద్దర్ ముందు వరుసలో ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సినిమా అవార్డులపై కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామన్న సీఎం గద్దరన్న పేరు మీద కవులు, కళాకారులను సత్కరించుకుంటామని ప్రకటించారు. ఆరు నెలల్లో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని కొందరు అంటున్నారని ఆ ప్రయత్నం చేసి చూస్తే.. ప్రజలే బుద్ధి చెప్తారని... రేవంత్‌రెడ్డి అన్నారు. భారాస నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారని దురాలోచన చేస్తే ప్రజలు గ్రామాల్లో కూడా తిరగనివ్వరని సీఎం అన్నారు. గద్దర్‌ దిశానిర్దేశంతోనే కేసీఆర్‌పై పోరాటం చేశానని రేవంత్‌ అన్నారు. సినీ కార్మికులకు గద్దర్‌ అవార్డులు ఇస్తామన్న రేవంత్‌ ప్రకటనతో.. సభలో ఉద్వేగపూరిత వాతావారణం నెలకొంది. సీఎం ప్రసగింస్తుండగానే మంత్రులు, కవులు, కళాకారులు వేదికపైకి వెళ్లి అభినందించారు. గద్దర్ అవార్డు ప్రకటించగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రేవంత్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కవులు, కళాకారులు కూడా రేవంత్‌ వద్దకు వెళ్లి... గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.


గద్దర్ అంతరంగాన్ని స్పష్టీకరిస్తూ రచించిన పాటకు జీవకణం, తరగని గని అనే రెండు పుస్తకాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ రోజు ఏ పని చేయాలన్న దాన్ని అడ్డుకోవలనే ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు చేసే సలహాలు ఇవ్వకుండా భారాస నేతలు శాపనర్ధాలు పెడుతున్నారన్నారు. వాటన్నింటికి కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితి లేదని.. పదేళ్ల పాటు సుస్థిర పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుంది. గద్దర్‌ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తాం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్‌ అవార్డు ఇస్తాం. ఇదే శాసనం.. నా మాటే జీవో’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి ట్యాంక్‌బండ్‌పై గద్దర్‌ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్‌ ప్రకటించారు. మరోవైపు తెల్లపూర్‌ మున్సిపాలిటీలో గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story