స్కూళ్లు, కాలేజీల్లో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

స్కూళ్లు, కాలేజీల్లో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు
స్కూళ్లు, కాలేజీల్లోనూ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. స్కూళ్లు, కాలేజీల్లోనూ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ నాగోల్‌ మైనార్టీ గురుకులంలో 38 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. హాస్టల్‌లో మొత్తం 184 మంది విద్యార్థులు ఉండగా.. యాంటిజెన్‌ పరీక్షల్లో 38 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతా విద్యార్థులకు RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరంతా 9, 10వ తరగతి విద్యార్థులు. ఐతే.. కరోనా పాజిటివ్‌గా తేలిన 38 మంది విద్యార్థుల్లో మాత్రం వైరస్‌ లక్షణాలు కన్పించడం లేదు. వీరిని నాగోల్‌ స్కూల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు.. గురుకులాన్ని సిబ్బంది శానిటైజ్ చేశారు. మేడ్చల్ జిల్లా DMHO మల్లికార్జున్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అటు హైదరాబాద్ నాగోల్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల హెడ్‌మాస్టర్‌ కరోనా బారిన పడ్డారు.. దీంతో స్కూల్‌ను మూసివేశారు అధికారులు. ఇతర ఉపాధ్యాయులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు కోత్తపేట్‌ హైస్కూల్లోనూ ఓ స్కూల్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవలే కరోనా టెస్టులు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 11 మంది టీచర్లు ...ఇద్దరు వంటవాళ్ళు కాగా మరొకరిని పదో తరగతి విద్యార్థినిగా గుర్తించారు. అప్రమత్తమైన అధికారుల మరో 20 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేల్చారు. అటు మంచిర్యాలలోని డిగ్రీ కాలేజ్‌లో 76 మంది స్టూడెంట్స్‌కు టెస్టులు నిర్వహిస్తే.. 16మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది..చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోనూ కరోనా కలకలం రేపింది. ఓ ఉపాధ్యాయుడు వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగతా టీచర్లు.. 159 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వుంది.

కామారెడ్డి జిల్లాలోనూ కరోనా పంజా విసురుతోంది.. టెక్రియాల్ కస్తుర్భాగాంధీ బాలికల పాఠశాలలో 32 మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. కలెక్టర్ శరత్ పాఠశాలను సందర్శించి..వైద్యులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. S.O లావణ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విద్యార్థులు వైరస్ బారిన పడ్డారని చెప్పారు.. పాజిటివ్‌గా తేలిన విద్యార్థినులకు ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని..సూచించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని విద్యార్థులకు భరోసా కల్పించారు కలెక్టర్.

గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. నిన్న ఒక్కరోజే పట్టణంలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..మారిస్‌పేటలోని జీవనజ్యోతి నర్సింగ్‌ కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులు వైరస్ బారిన పడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈ కాలేజ్‌లో నర్సింగ్ కోర్స్ చేస్తున్నారు.. తెనాలిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కాలేజీలు‌, స్కూళ్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story