అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా.. 26 మంది విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు

కరోనా మరోసారి పడగ విప్పుతోంది. అన్‌లాక్ వల్ల అందరూ దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ.. మహమ్మారి విజృంభన మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈమధ్య కాలంలో కరోనా దూకుడు మరింత ఎక్కువైంది. కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన వారిలో 33 మందికి కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్‌లో కరోనా కేసులు బయటపడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్దుంపూర్ వాసులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్టులు చేశారు. వీరిలో 33 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ 33 మందిలో 32 మంది చేగుర్తి వాసులేనని తేలింది. మరొకరు దుర్శేడ్ గ్రామానికి చెందిన వ్యక్తి. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ కూడా గ్రామంలో పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
విద్యార్ధులకు కరోనా సోకడం కూడా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్ గౌలిదొడ్డి గురుకులంలో ఒకరికి, సిరిసిల్లలో మరో విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. గౌలిదొడ్డి గురుకులంలో 26 మంది విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. గురుకులంలో మరికొందరికి తలనొప్పి, వాంతుల సూచనలు ఉండి తగ్గిపోయినట్లు విద్యార్థులు తెలిపారు. మరోవైపు పాఠశాల ప్రిన్సిపల్‌కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వైద్య, ఆరోగ్య శాఖ నిన్న 275 మందికి పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో 9వ తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలింది.
మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపు రెండున్నర నెలల తరువాత ఒకే రోజు 5వేల కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఎక్కడ ఎక్కువ కేసులు ఉంటే అక్కడ లాక్‌డౌన్, కఠిన చర్యలు తీసుకుంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ జోరుగా వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వస్తున్న కరోనా కేసుల్లో ఈ కొత్త వైరస్ కనిపిస్తోందని CCMB తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న వైరస్ కంటే ఈ కొత్త వైరస్ కాస్త వేగంగా వ్యాపిస్తోందనీ... కరోనా శరీరంలో వచ్చిన మార్పులే కారణమని CCMB చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com