తెలంగాణలో క్రికెట్ రాజకీయాలు!

తెలంగాణలో క్రికెట్ రాజకీయాలు!
యువతే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

తెలంగాణలో యువత చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. బిజెపి యూత్ ని టార్గెట్ చేస్తూ... కార్యక్రమాలు చేపడుతుండటంతో... అధికార టీఆర్ ఎస్ సైతం యువతను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా యూత్‌కు క్రికెట్ పోటీలు, గేమ్స్ నిర్వహిస్తూ యువత దూరం కాకుండా జాగ్రత్తపడుతోంది. ఇదే కోవలో సిద్దిపేటలోమంత్రి హరీష్‌ రావు..క్రికెట్ టోర్నీలను ప్రారంభించగా...పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు రాజకీయ నేతలు.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. యువతను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ లో ఉంది. ఇప్పటికే నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్లగొండ జిల్లా కలెక్టర్ కావడంతో ప్రధాన పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు అంతా నల్గొండ కలెక్టరేట్ కి క్యూ కట్టి నామినేషన్లను దాఖలు చే'స్తున్నారు. దీంతో నల్గొండలో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు తోడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఉండటంతో అన్నిపార్టీల చూపు దీనిపైనే ఉంది. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు నియోజకవర్గంపై పట్టు కలిగిన మాజీ సీఎల్ పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ముఖ్యమైన మున్సిపాలిటీలు, మండల కేంద్రాలను ఓ పర్యాయం చుట్టి వచ్చారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరికలను సైతం ప్రోత్సహిస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజవర్గాన్ని తానే అభివృద్దిచేశానని చెపుతున్నారు.

జనారెడ్డి తన ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని యువతను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ పార్టీ యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు చేపడుతుండటంతో.. జానారెడ్డి యూత్‌పై ఫోకస్ పెట్టారు. వారికోసం క్రికెట్, కబడ్డీ పోటీలను నిర్వహించి యూత్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. యువకులతో బ్యాట్ పట్టి క్రికెట్ సైతం ఆడుతున్నారు రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డి.

ఓ వైపు బిజెపి యువతను టార్గెట్ చేస్తుండడం.. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం యువతను ఆకర్షించేలా దూసుకుపోతుండగా.. ఆలస్యంగా తేరుకున్న టీఆర్ఎస్ యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలో ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండగా.. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ లతో కలిసి మొదటి మ్యాచ్లో బ్యాట్ పట్టి బౌండరీలు బాదాడు మంత్రి జగదీష్ రెడ్డి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ప్రస్తుత ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు, రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. యువతే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. క్రీడా పోటీల్లో సీనియర్ నేతలు హాజరై యూత్‌ను ఉత్సాహపరుస్తున్నారు. తమ రాజకీయ చతురతతో యూత్‌ను ఆకట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story