TS ELECTIONS: పార్టీల హోరు.. ప్రచార జోరు

TS ELECTIONS: పార్టీల హోరు.. ప్రచార జోరు
తెలంగాణలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల తిప్పలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. పదేళ్ల ప్రగతిని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావిస్తుండగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ విపక్ష పార్టీల అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. అభ్యర్థులను ప్రకటించిన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా వెళుతోంది. అభ్యర్థులు ప్రచారంతో గడపగడప తడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుబ్బాక నియోజవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రేకులకుంట మల్లన్నస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారంచుట్టారు.


దుబ్బాక ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు. కామారెడ్డి బిచ్కుంద మండల షెట్లూర్‌లో ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల, కోకియా నాయక్ తండ, చింతలకుంట, తండా గ్రామాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదెరి కిషోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో తుంగతుర్తి సశ్యశ్యామలం అయిందన్నారు. అంబర్‌పేట శంకర్‌ చేరికతో బీఆర్‌ఎస్‌ మరింత బలోపేతం అయిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.


కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం దూసుకుపోతోంది. ప్రతి కార్యకర్త మరోసారి సంగారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దొరల తెలంగాణ పోయి.. ప్రజా తెలంగాణ రాబోతుందని MP కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ VT కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత ప్రచారానికి శ్రీకారంచుట్టారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కామారెడ్డి అభివృద్ధి కోసం 150 కోట్లతో రూపొందించిన మేనిఫెస్టోని భాజపా అసెంబ్లీ ఇంచార్జి రమణారెడ్డి విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంగా ఎన్నికలప్రణాళిక ఆవిష్కరించామన్నారు. రెండుసార్లు ఎంపీగా ఉండి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదని రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రఘునందన్‌రావు.. అర్హులైన వారికి దళితబంధు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story