గ్రేటర్‌ ఎన్నిక‌లు.. కమలం దూకుడు కారు జోరుకు చెక్‌ పెడుతుందా?

గ్రేటర్‌ ఎన్నిక‌లు.. కమలం దూకుడు కారు జోరుకు చెక్‌ పెడుతుందా?

దుబ్బాక ఉప ఎన్నిక‌ గెలుపుతో ఊపుమీద ఉన్న బీజేపీ.. గ్రేట‌ర్‌లోనూ పాగా వేసేందుకు సన్నద్ధమవుతోంది. గ్రేటర్ ఎన్నిక‌లపై ఊహాగానాలు ప్రారంభ‌మైన నాటి నుండే.. బీజేపీ కీల‌క నేత‌లు క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తూ వ‌స్తున్నారు. నియోజ‌క వ‌ర్గాల వారిగా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల వేట‌లో ప‌డ్డారు. డివిజ‌న్‌ల‌లో ఓట‌ర్ల‌ను ప్రభావితం చేసే నేత‌ల‌ లిస్ట్ అవుట్ చేశారు.

గ్రేటర్‌ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్దంగా ఉండేలా నాయ‌కుల‌ను ముందే ప్రిపేర్ చేసింది బీజేపీ. ఇక ఇప్ప‌టికే బ‌రిలో దింపే నేత‌ల జాబితాను కూడా రెడీ చేసింది. నామినేష‌న్లకు కేవ‌లం మూడు రోజులే గ‌డువు ఉండ‌టంతో పార్టీ ముఖ్య‌నేత‌లు పూర్తి జాబితాను వీలైనంత త్వ‌ర‌గా సిద్దం చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మొద‌టి జాబితాగా 35మంది పేర్ల‌ను మంగళవారం ప్ర‌క‌టించాల‌ని భావించిన‌ప్ప‌టికీ ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకుంది బీజేపీ. ఇవాళ తొలి జాబితా విడుద‌ల చేస్తామంటున్నారు ఆ పార్టీ నేత‌లు. బ‌లమైన అభ్య‌ర్థుల వేట‌లో ఉన్న ఆ పార్టీ నేత‌లతో బండ కార్తిక రెడ్డి స‌మావేశం అయ్యారు. సికింద్రాబాద్ ప‌రిదిలో త‌న‌కు బలమైన కేడ‌ర్ ఉంద‌ని చెప్పుకుంటున్న బండ కార్తిక.. త‌న అనుచ‌రులు ముగ్గురికి టికెట్ ఇవ్వాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ టీఎంయూ నేత అశ్వ‌ద్దామ రెడ్డి సైతం కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, ల‌క్ష్మ‌ణ్ ల‌తో స‌మావేశం అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేత‌లు కూడా బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారు. వారంతా పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం క‌నిపిస్తుంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిదిలో టీఆర్ఎస్ నేత‌లే టార్గెట్ గా బీజేపీ ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఇన్నాళ్ళూ క‌ష్ట‌ప‌డి టికెట్ రాని బ‌లమైన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే డివిజ‌న్ స్థాయిలో అనేక మంది పార్టీలో చేరుతున్నారు. వారికి టికెట్ ఇస్తామని భ‌రోసా ఇచ్చారు నేత‌లు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల గెలుపుతో బీజేపీలో చేరేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నార‌ని .. అయితే పార్టీ గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే టికెట్ ఇస్తుందంటున్నా బీజేపీ నేతలు. హైద‌రాబాద్ లో వంద ‌సీట్లు గెల‌వ‌డ‌మే టార్గెట్ గా తాము ప‌నిచేసుకుంటు పోతున్నామంటున్నారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి.

అటు.. ఎంఐఎం అజెండా అమ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రిని ప్రజ‌ల్లో దోషిగా నిల‌బెడతామంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. మ‌జ్లిస్‌కే మేయ‌ర్ పీఠాన్ని క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌న్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక‌ల వ‌ర‌కు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని బీజేపీ.. నేడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వేగంగా అడుగులు వేస్తోంది. మరి కమలం దూకుడు కారు జోరుకు చెక్‌ పెడుతుందా? చూడలి.

Tags

Read MoreRead Less
Next Story