దేవరయాంజాల్‌కు ఉన్నత స్థాయి కమిటీ.. రాములోరి భూముల ఆక్రమణలపై శరవేగంగా విచారణ..!

దేవరయాంజాల్‌కు ఉన్నత స్థాయి కమిటీ.. రాములోరి భూముల ఆక్రమణలపై శరవేగంగా విచారణ..!
దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్‌ దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

తెలంగాణలో రాజకీయం భూముల చుట్టూ తిరుగుతుంది. మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్‌లో మరో పరిణామం చోటుచేసుకుంది. దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్‌ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజల్‌ గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవాలయ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణకు నిర్ణయించింది. ఈ దేవాలయానికి 15వందల 21 ఎకరాల 13 గుంటల భూమి ఉందని దేవాదాయ శాఖ చెబుతోందని, ఇందులో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ భూ బదలాయింపులు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

దేవాదాయ భూములను కొందరు వ్యక్తులు వారి సొంత పేర్లతోనూ, బినామీలతో పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారని, వాటి విలువ వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని, ఈ చర్యలు భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశాయని, ప్రభుత్వం వాటన్నింటిని పరిశీలించిన తర్వాత సమగ్ర విచారణకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు.

భూములను ఆక్రమించుకున్నవారు ఎవరు? అవి ప్రస్తుతం ఎలా ఉన్నాయి? కబ్జాదారుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఏమిటి? ప్రభుత్వం ఏవైనా అనుమతులు మంజూరు చేసిందా?.. ఆక్రమణదారులు, బినామీదారుల వెనక ఉన్న బలమైన వ్యక్తులెవరు? దేవాలయ ఆదాయానికి వచ్చిన నష్టం ఎంతో నిగ్గుతేల్చాలని, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన సిఫార్సులు చేయాలని ఆ కమిటీకి సూచించారు.

సమగ్ర విచారణ జరిపి త్వరగా నివేదిక ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టర్‌ను ఆదేశించారు. దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీ సోమవారమే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఐఏఎస్‌ అధికారులు మాజీ మంత్రి ఈటల నిర్మించిన గోదాములను పరిశీలించారు.

అయితే.. దేవరయాంజాల్ ఆలయ భూముల్లో సీఎం కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల భూములు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story