Husnabad: పసివాడిని వెంటాడిన మృత్యువు.. ఒకసారి తప్పించుకున్నా..

Husnabad: పసివాడిని వెంటాడిన మృత్యువు.. ఒకసారి తప్పించుకున్నా..
Husnabad: మనుషుల తప్పిదమో.. దేవుని రాతో.. రెండేళ్లు కూడా లేని చిన్నారి అప్పుడే ఒకసారి మృత్యుగండం నుంచి తప్పించుకున్నాడు..

హుస్నాబాద్: మనుషుల తప్పిదమో.. దేవుని రాతో.. రెండేళ్లు కూడా లేని చిన్నారి అప్పుడే ఒకసారి మృత్యుగండం నుంచి తప్పించుకున్నాడు.. నెల తిరక్కముందే పొంచి ఉన్న మృత్యువు చిన్నారిని తీసుకుపోయింది. అమ్మానాన్నకు తీరని దు:ఖం మిగిల్చింది. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. రెండు గదుల స్లాబు ఇల్లుతో పాటు వంట కోసం రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు.

రెండిటికీ మధ్యలో వెలుతురు కోసం అని తడికె ఉంచి అది గాలికి ఎగిరి పోకుండా దానిపైన బండ పెట్టారు. అయితే ఆ ఊరిలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దాంతో తడికె దగ్గర ఉన్న ఖాళీలో నుంచి శ్రీకాంత్ ఇంట్లోకి కోతులు వచ్చాయి. వాటిని అదిలించే క్రమంలో రజిత వంట గదిలోకి వెళ్లింది. ఆమె వెనుకే రెండేళ్ల కుమారుడు అభినవ్ కూడా వెళ్లాడు.. దీంతో కోతులు వచ్చిన దారే వెళ్లేందుకు తడక పైకి దూకాయి. ఈ క్రమంలో అక్కడ ఉంచిన బండరాయి చిన్నారి తల మీద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

నెల క్రితం అభినవ్ ఇంట్లో గడప దాటుతూ ముందుకు పడిపోయాడు.. దాంతో అక్కడే ఉన్న కత్తిపీట తగిలి గొంతు కొంత మేర తెగింది. దానికి వైద్యం చేయిస్తే నాలుగు లక్షలకు పైగా ఖర్చయింది. అయినా పిల్లవాడు క్షేమంగా బయటపడ్డాడని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నెల తిరక్కముందే కోతుల రూపంలో మృత్యువు చిన్నారిని కబళించింది.

Tags

Read MoreRead Less
Next Story