Cyber Crimes : హైదరాబాద్ లో పెరుగుతున్న సైబర్ నేరాలు

Cyber Crimes : హైదరాబాద్ లో పెరుగుతున్న సైబర్ నేరాలు
3 కోట్ల మేర కొల్లగొట్టిన కేటుగాళ్ళు

సైబర్‌నేరాల జాబితాలో కొత్తరాష్ట్రాలు చేరుతున్నాయి. ఇప్పటివరకు ఉత్తరాదిలోని కొన్నిరాష్ట్రాలకి చెందిన మోసగాళ్లే సైబర్‌నేరాలు చేస్తుండేవారు. అరెస్టైన నిందితులూ..... వారే ఉండేవారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండే నేరగాళ్లతో ఆన్‌లైన్‌లో సంప్రదిస్తూ వందలాది మందిని ముంచేసేవారు. తాజాగా హైదరాబాద్‌లోనూ సైబర్‌ నేరాలు చేస్తూ పలువురు కేటుగాళ్లు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది.

రోజురోజుకి సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. పంథా మార్చుకొని ఆశావాహులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలను ఖాతాలనుంచి కాజేస్తున్నారు కేటుగాళ్లు. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఆ నేరాలకు పాల్పడేవారు. ప్రస్తుతం ఆ కోవలోకి తెలుగు రాష్ట్రాలకు (Telugu States) చెందిన వారు చేరారు. సాధారణంగా కాల్‌సెంటర్‌ మోసాల్లో టెలీకాలర్లుగా మాట్లాడేందుకు తెలుగు రాష్ట్రాల్లోని యువకులను సైబర్‌ ముఠాలు ఉపయోగించేవి. కొన్ని నెలలుగా నమోదవుతున్న కేసుల్లో మాత్రం ఏపీ, తెలంగాణలోని వ్యక్తులే సొంతంగా నేరాలు చేస్తూ పట్టుబడుతున్నారు. లేదా పరోక్షంగా సహకరిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాల్లో నేరుగా స్థానికుల పాత్ర వెలుగుచూస్తుండడం ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు.

సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న నగరానికి చెందిన ఇద్దరు కేటుగాళ్లను ఇటీవల సీసీఎస్‌ అరెస్టు చేశారు. బేగంపేటకు చెందిన వారిద్దరూ డబ్బు సరిపోక టెలిగ్రామ్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లను సంప్రదించారు. అప్పటికే సమకూర్చిన బ్యాంకు ఖాతాలని సైబర్‌ నేరగాళ్లకు అందించడంతో ఇప్పటివరకూ దాదాపు3 కోట్ల మేర సొత్తుకొల్లగొట్టారు. మరో కేసులో ఆన్‌లైన్‌లో వస్తువులకు రేటింగ్‌ ఇస్తే కమీషన్‌ ఇస్తామని డబ్బు కొట్టేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన శిరీష్‌కుమార్‌గా గుర్తించారు. చైనాలోని సైబర్‌నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలు చేస్తున్నాడు. నగరంలోని యువతి నుంచి 60 లక్షల రూపాయల కాజేశాడు.

ఎక్కడో ఇతరరాష్ట్రాల్లో ఉండి ఇతరుల బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు ఉపయోగిస్తూ సైబర్‌ నేరగాళ్లు డబ్బు కొల్లగొడుతుంటారు. వివరాలన్నీ నకిలీవికావడం, సాంకేతికత సాయంతో ఒక రాష్ట్రంలో ఉంటూ మరో రాష్ట్రంలో నేరంచేసినట్లు బురిడీ కొట్టించేవారు. ఆ ముఠాలకు బ్యాంకు ఖాతాలు ఎంతో ముఖ్యం. నేరగాళ్లు తమ మోసాల కోసం టెలిగ్రామ్, వాట్సాప్‌లో గ్రూపులు తయారుచేసి మోసం చేయాలనుకున్న వారి ఫోన్‌నెంబర్లు అందులో చేరుస్తుంటారు. వారిలోని కొందర్ని ఎంపిక చేసుకొని వ్యక్తిగతంగా చాటింగ్‌ చేస్తారు. నమ్మకం కుదిరితే కమీషన్‌ లెక్కన చెల్లిస్తామని ఆశచూపిస్తారు. అవగాహనలేమితోడబ్బుకు ఆశపడే కొందరు బ్యాంకుఖాతాలు, ఇతర రహస్య వివరాలు ఇస్తున్నారు. ఇటీవలCCS పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో అలాంటి ఉదంతాలే ఎక్కువగా ఉంటున్నాయి. బాధితులు పరువుపోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడంలేదు. సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిలో ఎక్కువగా విద్యావంతులు ఉండడం కలవరపెడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story