KCR : కొత్త కూటమి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తోందా?

KCR : కొత్త కూటమి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తోందా?
KCR : సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారా? బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీఆర్ ప్రయత్నాలకు మద్దతు లభిస్తోందా?

KCR : సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారా? బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీఆర్ ప్రయత్నాలకు మద్దతు లభిస్తోందా? మాజీ ప్రధాని దేవేగౌడ... కేసీఆర్ కు ఫోన్ చేయడం, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ముంబైకి ఆహ్వానించడం అందుకేనా? వరుసగా పలు రాష్ట్రాల కీలక నేతలను కలుస్తుండడంతో ఫెడరల్ ఫ్రంట్ కు త్వరలో ఒక రూపు వచ్చే అవకాశం ఉందా? ఇంతకీ కేసీఆర్ తో ఏయే పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ, విభజన రాజకీయాలు చేస్తోందంటూ మండిపడుతున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవలే ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడడం... మోదీ రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేయడంతో... టీఆర్ఎస్, బీజేపీ మధ్య దుమారం రేగింది. ఆ మంటలు ఇప్పటికీ ఎగిసిపడుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్... వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. కొత్త కూటమి అంశాన్ని కేసీఆర్ ఎప్పుడో తెరమీదికి తెచ్చినా... ఇటీవలే మరింత స్పీడు పెంచారు.

మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ... సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని ఆయన ఫోన్ చేసి అభినందించారు. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా ఉంటాం. మీ యుద్ధాన్ని కొనసాగించండి. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. అని సీఎం కేసీఆర్​కు దేవగౌడ తన మద్దతును ప్రకటించినట్లు సమాచారం.

ఇక మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అయితే తన ఆతిథ్యాన్ని అందుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముంబైకి ఆహ్వానించారు. ఈ నెల 20న ఈ ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. కేసీఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే... కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి.

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మావంతు సహకారాన్ని అందిస్తామంటూ ఉద్ధవ్ థాకరే అన్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లపాటు బీజేపీతో దోస్తీ చేసిన శివసేన... గత మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కటీఫ్ చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకే బీజేపీపై గుర్రుగా ఉన్న ఉద్ధవ్ థాకరే... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలుపుతున్నట్లు టాక్.

మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రత్యామ్నాయ కూటమి కోసం గట్టిగానే పోరాడుతున్నారు. ఆమె కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారు. కేసీఆర్ తో పాటు అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కు కూడా ఫోన్ చేసి... ప్రయత్నాలను ముమ్మరం చేసే విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్, స్టాలిన్ లకు ఫోన్ చేసిన విషయాన్ని స్వయంగా మమతా బెనర్జీయే వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మమత తెలిపారు. అయితే మమత పిలుపుమేరకు విపక్ష ముఖ్యమంత్రులతో త్వరలో ఢిల్లీలో మీటింగ్ ఉంటుందంటూ స్టాలిన్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. మరి మమతా బెనర్జీ కేసీఆర్ కు తన మద్దతు ప్రకటిస్తారా? లేక తను ఏర్పాటు చేయబోయే ప్రత్యామ్నాయ కూటమికి సపోర్ట్ ఇవ్వాలని కోరుతారా? లేక కలిసి పనిచేద్దామంటారా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు.

ఇంతకు ముందు కూడా కేసీఆర్ పలువురు సీఎంలు, పార్టీల కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు మరింత జోరు పెంచడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల నేత్రుత్వంలోని కూటములకు దూరంగా ఉంటూ కొత్త కూటమి ఏర్పాటు అవసరం ఉందని సీఎం కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మొదట తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి చర్చించారు. ఇటీవల కూడా ఆయన తమిళనాడు టూర్ కు వెళ్లినప్పుడు కూడా మరోసారి స్టాలిన్ ను కలిసి ఇదే విషయంపై చర్చలు జరిపారు. ఆ తర్వాత నుంచి పలువురు సీఎంలు, కీలక నేతలతో వరసగా భేటీ అవుతూ వస్తుండడంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

స్టాలిన్ ను కలిసిన తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్ తోపాటు కమ్యూనిస్టు నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ఆ మరుసటి రోజే ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు గులాబీ బాస్. ఇటు బీహార్ మాజీ సీఎం, తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ గులాబీ బాస్ ఫోన్‌లో మాడ్లాడారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ కేసీఆర్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తోను కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని, మొత్తంగా అగ్గిపెట్టి చూపిస్తానని శపథం చేశారు కేసీఆర్. అందుకు అనుగుణంగానే ఆయన స్పీడ్ పెంచినట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరికొంత మంది నేతలను కూడా ఆయన త్వరలో కలుస్తారని గులాబీ శ్రేణులు అంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story