KCR: మోసపోతే గోస పడడం ఖాయం

KCR: మోసపోతే గోస పడడం ఖాయం
కుట్రలను వజ్రాయుధం లాంటి ఓటుతో బద్దలు కొట్టాలి... ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు...

ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి, అతనివెనకున్న పార్టీ చరిత్ర, గుణగణాలను చూసి వివేచనతో ఓటేయాలని గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రాజకీయంగా అస్థిరపరిచే కుట్రలను వజ్రాయుధం లాంటి ఓటుతో తిప్పికొట్టాలని సూచించారు. కామారెడ్డి ప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి KCR కాంగ్రెస్‌, బీజేపీ వైఖరిపై మండిపడ్డారు. మోసపోతే మరోసారి గోసపడటం ఖాయమని హెచ్చరించారు. కామారెడ్డితో పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉందన్న ముఖ్యమంత్రి KCR నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న గులాబీ దళపతి ఎన్నికల్లో నాయకులు కాదు ప్రజలు గెలవాలని పిలుపునిచ్చారు. ఎవరిని గెలిపిస్తే భవిష్యత్‌ ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలనన్న కేసీఆర్‌ పార్టీల వైఖరిపై గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్న సీఎం... మిగిలి ఉన్న లక్ష మందికి పింఛన్‌ అందిస్తామని భరోసా ఇచ్చారు.


కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై ముఖ్యమంత్రి విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతుబంధు వృథా, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు, ధరణి ఎత్తేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాలను, గులాబీ పార్టీని అస్థిరపరచాలనే కుట్రతో ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బుసంచులతో దొరికిపోయిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందన్న గులాబీ దళపతి... అలాంటి వారిని తరిమికొట్టాలని సూచించారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ, వైద్యకళాశాల ఇవ్వకుండా తెంలగాణ ప్రజల నోట్లో మన్నుకొట్టిన మోదీ పార్టీకి ఒక్క ఓటు వేయొద్దని జనాన్ని కోరారు. తనకోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన గంప గోవర్దన్‌ను రాజకీయంగా మరింత ఉన్నతంగా నిలబెడతానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.


వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి యాభై లక్షల నగదుతో పట్టుబడ్డ వ్యక్తే ప్రస్తుతం కామారెడ్డిలో తనపై పోటీకి దిగుతున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాజకీయ అస్థిరత తేవాలనే దురుద్దేశంతో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆయనకు కామారెడ్డి ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం గెలవాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన పూర్వీకుల గ్రామం ఇదే జిల్లాలోని బీబీపేట మండలం కోనాపూర్‌ అని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ పరిణతి సాధించిన దేశాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయన్నారు. ఆలోచించి ఓటేసినప్పుడే ఎన్నికలలో ప్రజల గెలుపు సాధ్యమవుతుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story