KCR: ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్.. బీజేపీని టార్గెట్..

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: సీఎం కేసీఆర్‌ ఎన్నికల సైరన్ మోగించారా? బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది టీఆర్‌ఎస్.

KCR: సీఎం కేసీఆర్‌ ఎన్నికల సైరన్ మోగించారా? ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని నిలదీయాలని పిలుపునివ్వడం ద్వారా సమరభేరి మోగిస్తున్నారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటే.. మరింత కష్టపడాలని చెప్పడం ద్వారా ఎలక్షన్ సీజన్‌ను కాస్త ముందుగానే తీసుకొస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది టీఆర్‌ఎస్.

ఊరూరా చావు డప్పు మోగించి, బీజేపీ నేతలను ఉరికించండంటూ పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పనిలో పనిగా కేంద్ర బీజేపీపైనా ఒత్తిడి పెంచాలని వ్యూహం పన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆరుగురు మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోరామని చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోళ్లు అనే అంశాన్ని హైలెట్‌ చేస్తున్న టీఆర్‌ఎస్‌.. బీజేపీని ఎండగట్టాలని టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించింది.

బీజేపీ అంటే అసహ్యం పుట్టేలా చేయాలని, కేంద్ర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీ నేతలను నిలదీయాలని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే.. అక్కడే కూర్చుని తేల్చుకుని రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నామన్నది ముందే చెప్పేశారు కేసీఆర్.

ఇప్పుడున్న ఎమ్మెల్యేలకే టికెట్లు వస్తాయని చెప్పి ఓ షరతు విధించారు. జనంలో ఉండే వాళ్లకే టికెట్లు దక్కుతాయని, ప్రజల్లో ఉండి పనిచేసే ఎమ్మెల్యేలను గెలిపించుకుని తీరతామని చెప్పారు. ఒకవేళ జనానికి దూరంగా ఉండే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని చెప్పుకొచ్చారు. రైతు బంధు, దళిత బంధును ఆపేది లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

ఇవాళ దళిత బంధుపై ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పథకం అమలవుతున్న తీరు, లబ్దిదారుల ఎంపికలో ఎదురైన ఇబ్బందులపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఇవాళ సుదీర్ఘంగా చర్చిస్తారు. దళితబంధును ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి ఇవ్వాలనేది ఎమ్మెల్యేనే చూడాలని చెప్పారు. మొత్తానికి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి పార్టీ క్యాడర్‌ను రెడీ చేస్తున్నారు సీఎం కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story