BRS: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి

BRS: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి
గులాబీ శ్రేణులకు కేసీఆర్‌ దిశా నిర్దేశం....అసెంబ్లీ ఫలితాలతో నిరాశ చెందొద్దని హితబోధ

శాసనసభ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందవద్దని క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ కేడర్‌ను ఉపయోగించుకొని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ ఎంపీలకు భారాస అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న ఆయన... త్రిముఖ పోరులో పార్టీకి అనుకూల వాతావరణం ఉంటుందన్నారు. కృష్ణా జలాలు, తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తాలని సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఎంపీల సమావేశం మూడు గంటలపాటు సాగింది. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే దళం భారాసనే అని కేసీఆర్‌ అన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో.. రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. నాడైనా... నేడైనా... తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో... అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత... మరోసారి బీఆర్‌ఎస్‌ ఎంపీలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదని... రాష్ట్ర ప్రజల ఆశలు బీఆర్‌ఎస్‌ ఎంపీలపైనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా... లేకపోయినా... రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది గులాబదళమేననని కేసీఆర్‌ తెలిపారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు.... ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్‌ లేకుండా ప్రాజెక్టులను ఎలా తీసుకుంటారని కేసీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని పార్టీ ఎంపీల బృందం ప్రత్యేక కలవాలని... ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వాలని తెలిపారు. కృష్ణాజలాలు సహా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌ సమావేశాల్లో గళమెత్తుతామని భారాస లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ పనిచేసుకుపోవాలని కేసీఆర్‌ సూచించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం మరోమారు సమావేశమవుతానని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story