TG: తెలంగాణలో ప్రతిపక్షాల ప్రచార జోరు

TG: తెలంగాణలో ప్రతిపక్షాల ప్రచార జోరు
కాంగ్రెస్‌ విఫలమైందంటూ విమర్శలకు పదును.... బీఆర్‌ఎస్‌ తరఫున మాజీమంత్రి హరీశ్‌రావు విస్తృత ప్రచారం

లోక్‌సభ ఎన్నికలకి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. నిత్యం జనంలోకి వెళ్తూ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలమైందంటూ విమర్శలకు పదునుపెడుతున్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున మాజీమంత్రి హరీశ్‌రావు విస్తృతంగా సమావేశాలతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కమలం అగ్రనేతలు కిషన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంతో ప్రతిపక్షాలు సైతం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విద్యార్థి యువజన చైతన్య సమావేశానికి బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ హాజరయ్యారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కార్‌... ప్రజలను గోసపెడుతోందని ఆరోపించారు. నిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడే తనను... మరోసారి ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ వచ్చాక..పాత పథకాలు అటకెక్కగా..కొత్తవాటికి సైతం దిక్కు లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాద్‌లోలో జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.


ప్రధాని మోదీ హయాంలో భారత్‌ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ పదికి పైగా ఎంపీ సీట్లు గెలవటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నాణానికి బొమ్మ, బొరుసు లాంటివనీ..దేశ ప్రజలకు అండగా ఉంటున్న ఏకైక నాయకుడు మోదీ అని మెదక్ బీజేపీ MP అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయపు నడక కోసం వచ్చిన వారిని ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కలిశారు. కార్యకర్తలతో మైదానం మొత్తం కలియ తిరుగుతూ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్‌లో బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ విజయసంకల్ప సమ్మేళనంలో ఆపార్టీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నేత మురళీధర్‌రావులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్‌ లక్ష్యంగా విమర్శలకు పదునుపెట్టారు. బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టం చేసే దిశగా పదేళ్ల మోదీ ప్రగతిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పరిధి మామిడిపల్లిలో రైతులతో కలిసి 'చాయ్ పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్... తప్పుడు వాగ్దానాలు, అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అకాల వర్షాలకు కేంద్రాల్లో ధాన్యం తడుస్తున్నా... రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. భారాసలో రంజిత్‌ రెడ్డి ఉన్నపుడు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని...ఇప్పుడు ఆ నేతలు అయనకు సహకరించడంలేదని చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే రంజిత్ కులాలు, మతాల పేరిట ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story