Campaign: ప్రచార హోరు.. అభ్యర్థుల జోరు

Campaign: ప్రచార హోరు.. అభ్యర్థుల జోరు
తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం... వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. తమదైన వ్యూహాలతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రచార రథాలను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రచారం చేస్తుండగా హామీల అమలులో విఫలమయ్యారంటూ బీఆర్ఎస్‌ ఆరోపిస్తోంది. మోదీ చరిష్మానే నమ్ముకున్న కమలం నేతలు మరోసారి ప్రధాని కావడం ఖాయమంటూ వివరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏక్ నాథ్ షిండేలు ఎవరూ లేరని... రాబోయే పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే ఉంటారని.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌ నేత హరీశ్ రావు, భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క MP స్థానం గెలవబోదని జోస్యం చెప్పారు.


ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ నగర్, కవాడిగూడ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు. స్థిరమైన పాలన కోసం నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేసిన మోదీ సర్కార్‌ని ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. నిజామాబాద్‌ చాయ్‌ పే చర్చలో పాల్గొన్న MP ధర్మపురి అర్వింద్‌... కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌... దాటవేత ధోరణి అవలంబిస్తోందని వరంగల్ భాజపా అభ్యర్థి అరూరి రమేష్ హనుమకొండలో విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియంకు బుద్ధి చెప్పాలని సీతారాంనాయక్‌ సూచించారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌ భాజపా కార్యాలయంలో ప్రచార రథాలను ఆ పార్టీ అభ్యర్తి సైదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భువనగిరిలో బీజేపీ బూత్ స్థాయి, పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. భువనగిరి గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బూర ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్దంగా పనిచేస్తే గెలుపు నల్లేరుపై నడకేనని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సిద్దిపేటలో గులాబీ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ, వడ్లకు ఐదొందల రూపాయల బోనస్‌, 4 వేల పింఛన్‌, మహిళలకు 2వేల 500 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ రాకతోనే కరవుకు స్వాగతం పలికారని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story