Manneguda Kidnap Case: నవీన్ రెడ్డి ఓ సైకో: యువతి తండ్రి ఆరోపణ

Manneguda Kidnap Case: నవీన్ రెడ్డి ఓ సైకో: యువతి తండ్రి ఆరోపణ
Manneguda Kidnap Case: కిడ్నాప్‌ ఘటనపై యువతి తండ్రి ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Manneguda Kidnap Case: కిడ్నాప్‌ ఘటనపై యువతి తండ్రి ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్‌ రెడ్డి, అతని అనుచరులపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, అపహరణ, దాడితో పాటు పలు కేసులు నమోదు చేశారు. బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రంలో తన కుమార్తెకు నవీన్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని.. ప్రేమ, పెళ్లి పేరుతో రెండేళ్లుగా తన కుమార్తెను వేధించాడని కంప్లైంట్ ఇచ్చాడు యువతి తండ్రి.





నవీన్‌రెడ్డి రూబెన్‌, మరో 50 మంది అనుచరులు కారులో ఐరన్‌ రాడ్లు, రాళ్లు తీసుకొని వచ్చి తన ఇంటిపై దాడి చేశారన్నారు. తన కుమార్తెతో పాటు తమ కుటుంబసభ్యులను చంపాలని ఇంట్లోకి దూసుకొచ్చారని, నవీన్‌రెడ్డి.. తన తలపై రాడ్డుతో దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. తన స్నేహితులు మధ్యలోకి వస్తే వారిపైనా దాడి చేశారని, దాడి తర్వాత తన కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేశారన్నారు యువతి తండ్రి.




తన కుమార్తె విషయంలో నవీన్ రెడ్డి మొదటి నుంచి సైకోలా వ్యవహరించాడని చెబుతున్నాడు యువతి తండ్రి. తన కూతురిని సొంతం చేసుకోవాలని ఎన్నో డ్రామాలు ఆడాడని, తన కూతురుతో వివాహం జరిగినట్లు నమ్మించేందుకు ఎన్నో కుట్రలు చేశాడన్నాడు. గతేడాది ఆగస్టు 27వ తేదీన తన కుమార్తెతో వివాహమైందని ప్రచారం చేసుకున్నాడని, తన భార్యను పంపించడం లేదంటూ ఎల్బీనగర్ కోర్టులో నవీన్‌రెడ్డి పిటిషన్ వేశాడని చెబుతున్నారు.




ఓ వాహనం కొనుగోలు చేసి అందులో నామినీగా భార్య పేరు స్థానంలో తన కుమార్తె పేరు రాయించుకున్నాడన్నారు. ఆ పత్రాలను ఆధారంగా చూపించి కోర్టులో పిటిషన్ వేశాడని, ఆగస్టు 27న అనారోగ్యం కారణంగా తన కుమార్తె ఆస్పత్రిలో ఉందని చెప్పుకొచ్చారు. తన కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందిన బిల్లులే ఇందుకు నిదర్శనం అన్నారు యువతి తండ్రి. నవీన్ రెడ్డి పెళ్లి విషయంలో అబద్ధం చెబుతున్నాడని, తన కూతురుతో కలిసి దిగిన ఫొటోలను నవీన్ రెడ్డి పెళ్లి ప్రచారానికి వాడుకున్నాడని చెప్పుకొచ్చారు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పలువురికి ఆ ఫొటోలను పంపించడంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story