తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ సెగలు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల  రాజకీయ సెగలు!
అధికార విపక్షాల విమర్శలు..ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. రాజకీయ సెగలను అమాంతం పెంచేసింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ప్రచారం మరింత వేగం పుంజుకుంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తరపున ప్రణాళికా సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వరంగల్‌లో ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మరికొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందన్న వినోద్‌ కుమార్‌.. ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అటు..కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉంటుందన్నారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ తరపున ప్రచారం చేశారు. అన్ని పార్టీలు అగ్రవర్ణాల వ్యక్తులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి దింపితే.. కాంగ్రెస్ మాత్రమే గిరిజన బిడ్డను నిలబెట్టిందని అన్నారు. టీఆర్ఎస్.. బీజేపీ ఉమ్మడి ఒప్పందంతో కార్యచరణ రూపొందించుకున్నాయని.. అందుకే అన్ని వర్గాలను ఆదరించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉత్తమ్ కోరారు.

కోదాడలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు.. ఆ పార్టీ తరపున అభ్యర్థి అయిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రచారం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కోదండరామ్.. మేం ప్రచార తీవ్రత పెంచడంతో.. పట్టభద్రుని రేటు పది వేలకు చేరిందని ఎద్దేవా చేశారు. లక్ష 20 వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్‌ చెబుతున్నారని.. కానీ లెక్కలు తీస్తే అవి 77వేలుగా తేలాయన్నారు కోదండరాం. ఈ విషయంలో చర్చకు సిద్ధమన్న కేటీఆర్.. ఆ తర్వాత మొఖం చాటేశారన్నారు. రాజకీయ నాయకులు భూ మాఫియా.. కాంట్రాక్టర్లు ఇసుక దందాలు చేసుకుంటూ ఉన్నారని.. ఇవన్నీ పోవాలంటే తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మొత్తానికి అధికార విపక్షాల విమర్శలు..ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రాజకీయ సెగలను అమాంతం పెంచేసింది.

Tags

Read MoreRead Less
Next Story