ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. మంత్రులతో సీఎం భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. మంత్రులతో సీఎం భేటీ
మరోసారి ఇలాంటి ఫలితాలు రిపీట్ కాకుండా మంత్రులు జాగ్రత్త పడాలని సీఎం సూచించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ప్రగతి భవన్‌లో కొద్ది మంది మంత్రులతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు . ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్ , నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , సబితా ఇంద్రారెడ్డి ,మల్లారెడ్డి , మహమూద్ అలీ ,ప్రశాంత్ రెడ్డి , కేటీఆర్ ,హరీష్ రావు హాజరయ్యారు. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యే లతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయాలని మంత్రులకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రి ప్రశాంత్ రెడ్డిని , రంగారెడ్డి జిల్లాకు హరీష్ రావు, హైదరాబాద్ జిల్లాకు గంగుల కమలాకర్‌ను ఇంఛార్జ్ లుగా నియమించారు గులాబీ బాస్. ఇంఛార్జ్ మంత్రులు ,జిల్లా మంత్రులు సమన్వయంతో ప్రచారం ముమ్మరం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

ఎన్నికలు జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 77 నియోజకవర్గాలు ఉన్నాయి. సగం తెలంగాణ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలను రిఫరెండంగా సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దుబ్బాక ,జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటమి తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్లను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజల మూడ్ ఎలా ఉందనేది ఈ ఫలితాలు చెప్తాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యే లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే పరిస్థితి లేదని టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో అభ్యర్థులతో సంబంధం లేకుండానే పార్టీ నేతలు ఎన్నికల భాధ్యతను తీసుకోవాలని గులాబీ బాస్ ఆదేశించారట.

రెండు ఎమ్మెల్సీ స్థానాల బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ లో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అధికార పార్టీ కి లాభం చేకూరుతుందని టీఆర్ఎస్ భావిస్తుంది..అయితే ప్రభుత్వ అనుకూల ఓటు చీలకుండా జాగ్రత్త పడాలని మంత్రులకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రుల ఇలాకాలో పార్టీ ఓడిపోవడం వల్లే మెజారిటీ సీట్లు సాదించలేకపోయామని అధిష్టానం భావిస్తోంది... మరోసారి ఇలాంటి ఫలితాలు రిపీట్ కాకుండా మంత్రులు జాగ్రత్త పడాలని సీఎం సూచించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మొత్తానికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను టిఆర్ఎస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఫలితాలే పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story