నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఫోకస్.. పోటీకి సై అంటున్న బీజేపీ

నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఫోకస్.. పోటీకి సై అంటున్న బీజేపీ

హుజూర్ నగర్, దుబ్బాక బైపోల్స్ తర్వాత మరో ఉపఎన్నిక అనివార్యమైంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సెట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే.. నాగార్జునసాగర్ లో భిన్న పరిస్థితులుంటాయనే చెప్పాలి. నాగార్జునసాగర్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. జానారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రెండే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోగా.. అందులో 2018 ఎన్నికలు ఒకటి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 7వేల ఓట్ల మెజారిటీతో జానారెడ్డిపై గెలిచారు. సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డిపై సహజంగా ఉండే వ్యతిరేకత, ఇతర అంశాలు జానారెడ్డి ఓటమికి దోహదం చేశాయి. అయితే, ఈసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఎన్నికలు జరగనున్నాయి. అయితే, దుబ్బాక, జిహెచ్ఎంసీ ఇచ్చిన బూస్టప్ తో బిజెపీ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది.

దుబ్బాక ఉపఎన్నిక అనుభవంతో అధికార పార్టీ ఈసారి చాలా పక్కాగా.. పూర్తి వ్యూహ రచనతో రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థి విషయంలో పలు ఉహాగానాలు ఉన్నా.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సెంటిమెంట్ తో పాటు అధికార పార్టీ మద్ధతు, సామాజికవర్గ బలం భగత్ కు సానుకూల అంశాలుగా ఉన్నాయి. అయితే మొన్నటి దుబ్బాక ఎన్నికల ఫలితం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో యువకుడిని పెట్టి ప్రయోగం చేయవద్దని జానారెడ్డి వంటి సీనియర్ నేతతో.. బిజెపి వ్యూహాలతో భగత్ తలపడలేడని టిఆర్ఎస్ లోని మరో వర్గం అభిప్రాయపడుతుంది. దీంతో.. టిఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ నేత ఎంసీ కోటిరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డికి గట్టి పట్టు ఉందనడంలో సందేహం లేదు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగితే.. విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. 2018 ఎన్నికల సమయంలోనే తాను పోటీ చేస్తానంటూ ముందుకొచ్చిన జానా తనయుడు రఘువీర్ రెడ్డి.. ఈసారి బరిలోకి దిగేందుకు మరింత ఒత్తిడి చేస్తారని టాక్ వినిపిస్తుంది. పోటీకి ఆసక్తి చూపుతున్న రఘువీర్‌తో బిజెపి టచ్‌లోకి వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. రఘువీర్ కు టికెట్ ఇవ్వడంతో పాటు.. జానారెడ్డికి కేంద్రంలో సముచిత స్థానం ఇచ్చే ప్రతిపాదనను బిజెపి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జానారెడ్డి తనయులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డి.. 7వ తేదీన తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తుంది.

మరోవైపు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి తమతో టచ్ లో ఉన్నారంటూ ఆ పార్టీ లీకులిస్తోంది. రఘువీర్ కు సాగర్ సీటు ఇవ్వడంతో పాటు.. జానారెడ్డికి కేంద్రంలో సముచిత స్థానం కల్పిస్తామని బిజెపి ప్రతిపాదన ఉంచినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారం కాంగ్రెస్ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. ఇక టిడిపి నుంచి బిజెపిలో చేరిన కడారి అంజయ్యయాదవ్ పేరును కూడా ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీచేసిన కడారి అంజయ్యకు 22వేల ఓట్లు సాధించారు. ఈసారి టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాట్లు తెలుస్తోంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కంచుకోటను బద్దలుకొట్టిన టిఆర్ఎస్.. ఆ స్ఫూర్తిని ఇక్కడ నిలుపుకుంటుందా? నియోజకవర్గంపై పూర్తి పట్టున్న జానారెడ్డి తిరిగి హవా కొనసాగిస్తారా? నాగార్జునసాగర్‌లోనూ బీజేపీ విజయ పరంపర కొనసాగిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story