తెలంగాణలో నాగార్జున సాగర్ పొలిటికల్ హీట్

తెలంగాణలో నాగార్జున సాగర్ పొలిటికల్ హీట్
నామినేషన్లకు మూడు రోజులే సమయం ఉండటంతో ఇటు ప్రధాన పార్టీల్లో, అటు టికెట్‌ ఆశించిన వారిలో టెన్షన్‌ పెరిగిపోతోంది.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ మరింత పెంచుతోంది. నామినేషన్లకు మూడు రోజులే సమయం ఉండటంతో ఇటు ప్రధాన పార్టీల్లో, అటు టికెట్‌ ఆశించిన వారిలో టెన్షన్‌ పెరిగిపోతోంది. వరుస సెలవులు రావడంతో మరో రెండ్రోజుల వరకు మాత్రమే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక నామినేషన్ల దాఖలుకు చాలా తక్కువ సమయమే ఉండటంతో పార్టీలన్నీ ఫోకస్‌ మరింత పెంచాయి.. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పటికే జానారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గులాబీ అభ్యర్ధి ఎవరనేదానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 30 వరకు నామినేషన్లకు చివరి గడువు కాగా.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీఆర్ఎస్ హైకమాండ్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్ధి ఎంపికలో సామాజిక సమీకరణాలు టీఆర్ఎస్‌కు కీలకంగా మారాయి. రెండుసార్లు యాదవ సామాజిక వర్గం నేతల చేతిలో జానారెడ్డి ఓడగా.. ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేసే యోచనలో గులాబీబాస్ ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు యాదవులే కావడంతో అదే సామాజికవర్గం నుంచి రేసులో నోముల భగత్ యాదవ్, మన్నే రంజిత్‌ యాదవ్, గురువయ్య యాదవ్ రేసులో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థి విషయంలో కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు అభ్యర్ధి కోసం జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. నోముల భగత్‌కు మండలి ఛైర్మన్ గుత్తా సపోర్టు చేస్తుండగా.. కోటిరెడ్డి లేదా మన్నెం రంజిత్‌ యాదవ్‌ వైపు మంత్రి జగదీష్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. మంత్రులకు సైతం ప్రచార ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులు హరీష్‌రావు, తలసాని, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను ఇంఛార్జిలుగా నియమించడంతో ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు హోరెత్తిస్తున్నారు.

అటు నాగార్జున సాగర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ సైతం అభ్యర్థి విషయంలో ఎత్తుగడలు వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలాకే తమ అభ్యర్థిని ప్రకటించాలని డిసైడ్ అయింది. దుబ్బాక ఎన్నికల వ్యూహాన్ని సాగర్‌లోను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టీఆర్ఎస్‌ను ఢీ కొట్టే బలమైన అభ్యర్థి కోసం అన్ని కోణాల్లోను కసరత్తు చేస్తోంది బిజెపి రాష్ట్ర అధిష్టానం. సాగర్ త్రిముఖ పోటీలో గెలుపుకోసం ఎవరికి వారే తమదైన వ్యూహారచన చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story