Huzurabad byelection: గెలుపే ధ్యేయంగా హుజూరాబాద్‌లో ప్రధాన పార్టీల ప్రచారం..

Huzurabad byelection: గెలుపే ధ్యేయంగా హుజూరాబాద్‌లో ప్రధాన పార్టీల ప్రచారం..
Huzurabad byelection: హుజూరాబాద్ బై పోల్ దగ్గర పడుతుండటంతో... పార్టీలు దూసుకపోతున్నాయి. ప్రధాన పార్టీల ప్రచారం క్షేత్ర స్థాయిలో రణరంగాన్ని తలపిస్తోంది.

Huzurabad byelection: హుజూరాబాద్ బై పోల్ దగ్గర పడుతుండటంతో... పార్టీలు దూసుకపోతున్నాయి. ప్రధాన పార్టీల ప్రచారం క్షేత్ర స్థాయిలో రణరంగాన్ని తలపిస్తోంది. గెలుపు ధ్యేయంగా అస్త్రశస్త్రాలను సంధిస్తున్నాయి.

హుజూరాబాద్‌లో ఎలాగైన మళ్లీ గులాబీ జెండా ఎగరవేసేందుకు టీఆర్‌ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈసీ తాజా నిబంధనల నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై అధికారపార్టీ దృష్టి సారించింది.

బై పోల్ జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిబంధనల నేపథ్యంలో...టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహం మార్చింది.

తొలుత అనుకున్న పొరుగున గల హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో... సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సభ సాధ్యం కాని పక్షంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.

రోడ్ షోలో విషయంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉపఎన్నికకు ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా... ఈనెల 26, 27 తేదీల్లో సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. గురువారం సీఈసీ కీలక ఆదేశాలతో...ప్రత్యామ్నాయంపై సీఎం కేసీఆర్ గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు.

ఇప్పటికే హుజూరాబాద్‌లో ప్రచారంలో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, కమలాకర్‌, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సభపై ఆంక్షలున్నందున.. దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల నిబంధనల మేరకు నియోజకవర్గంలోనే రోడ్‌షోలు నిర్వహించాలనే అంశం చర్చకు వచ్చింది.

ఈనెల 26, 27 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించాలని మంత్రులు కోరగా... సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రోడ్‌షోలకు సంబంధించిన షెడ్యూలును రూపొందించి పంపాలని కేసీఆర్‌ స్థానిక మంత్రులు, నేతలకు సూచించారు.

ఇవాళ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నేతలతో.. సమావేశమై షెడ్యూలుకు రూపకల్పన చేసి, సీఎంకు పంపనున్నట్లు తెలుస్తోంది.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ కోసం మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. జమ్మికుంట మండలం మాడిపల్లిలో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు.. ఆయన తన బాధను ప్రజల బాధగా చూపించి లబ్ధిపొందాలనిచూస్తున్నారని ఫైరయ్యారు.

కరోనా నుంచి కోలుకున్న అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌ హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి గురించి వివరిస్తూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. హుజురాబాద్‌లో బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.. ఈనెల 27న నిర్వహించే సభకు సీఎం కేసీఆర్‌ రావాలని ఆహ్వానించామన్నారు.

ఈటల రాజేందర్‌ కోసం రాష్ట్ర నాయకులంతా ప్రచారానికి వస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. హుజురాబాద్‌ ప్రజలు నిజాయితీతో ఆలోచిస్తారని అన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి చేసుంటే ఓట్లెందుకు కొనుక్కుంటోందంటూ మండిపడ్డారు.

హుజురాబాద్‌లో గెలిచేది బీజేపీయేనని విజయశాంతి అన్నారు.. ఈటల రాజేందర్‌ తరపున ప్రచారం నిర్వహించిన రాములమ్మ.. టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.. ప్రజా సేవ చేసినందుకు ఈటలను కేసీఆర్‌ పార్టీ నుంచి వెళ్లగొట్టారని అన్నారు.. హుజురాబాద్‌ ప్రజలు ఈటల రాజేందర్‌ను గుండెల్లో పెట్టుకుంటారన్నారు విజయశాంతి.

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు.. ఇక ఈనెల 23, 24 తేదీల్లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు.

మరోవైపు హుజురాబాద్‌లో యువత, నిరుద్యోగులు తనకు ప్రచారం చేయడంలో ముందున్నారని బల్మూరి వెంకట్‌ చెప్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒకటేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు.. రాబోయే రోజుల్లో రెండు పార్టీలకు మంచి గుణపాఠం చెబుతారన్నారు.

మరోవైపు హుజురాబాద్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో ఇంటికో ఓటు కాంగ్రెస్‌ వేయండి అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని చెప్పారు.

నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే వారం రోజులపాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలపై నాయకులతో చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story