Movie Ticket Rates: తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Movie Ticket Rates: తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Movie Ticket Rates: సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Movie Ticket Rates: సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏపీలో జగన్ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది. సినిమా టికెట్ ధరల్లో జగన్ సర్కార్‌ జోక్యంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు థియేటర్ యజమానులు. ఓవైపు జగన్‌ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచుకోవచ్చు అంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

అధికారుల కమిటీ సిఫారసుల మేరకు టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు ధర ఉండొచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్‌ల్లో అయితే 100 నుంచి 250 రూపాయల వరకు, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది.

టికెట్‌ ధరల పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణలో థియేటర్ల యజమానులు హైకోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో థియేటర్లలో టికెట్‌ ధరల ఖరారుకు ప్రభుత్వం అధికారుల కమిటీ నియమించింది. ఈ కమిటీ సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపి కొన్ని సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సుల ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.

ఏపీలో మాత్రం ఇందుకు విరుద్దంగా నడుస్తోంది. సినిమా టికెట్ల ధరలను తగ్గించడమే ప్రజా సంక్షేమంగా చెప్పుకోవడంపై జగన్‌ సర్కారుపై విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. అసలే కరోనాతో రెండేళ్లు సినిమా ప్రదర్శనలకు దూరంగా ఉండడంతో.. తెలంగాణ ప్రభుత్వం కాస్త దయతలిచింది.

కాని, జగన్ ప్రభుత్వం మాత్రం కరోనా సమయంలో ఆదాయం తగ్గిందని చెప్పి పెట్రోల్‌పై వ్యాట్ పెంచి, సినిమా టికెట్ల ధరలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా ధర తగ్గించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో.. ఏపీలో థియేటర్ల యజమానులు తమ రాష్ట్ర తీరుపై పోల్చి చూసుకుంటున్నారు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు సరైనదే అయినప్పుడు.. ఏపీలో మాత్రం ఎలా తప్పు అవుతుందని ప్రశ్నిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story