బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెలకొన్న పరిస్థితులు

బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెలకొన్న పరిస్థితులు
బల్దియా కార్పొరేటర్లలోని కొందరు.. వివాదాల జోలికి వెళ్తూ చివరికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తున్నారు.

బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ ఒకటిన GHMC ఎన్నికలు జరగ్గా, డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉండడంతో ఫలితాలు వచ్చి రెండు నెలలైనా కొత్త పాలక మండలి ఏర్పాటు కాలేదు. ఫిబ్రవరి 11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 తరువాత ప్రస్తుత కార్పొరేటర్లు మాజీలు కాబోతున్నారు. అయినప్పటికీ.. ఇన్నాళ్లూ చేసింది చాలదన్నట్టు ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమాలు మాత్రం ఆపడం లేదు.

నెరేడ్‌మెట్ డివిజన్ TRS సిట్టింగ్ కార్పొరేటర్ GK శ్రీదేవి అక్రమ కట్టడాలతో పాటు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నీ మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న GHMC అధికారులను అడ్డుకోవడంతో నెరేడ్‌మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని పోలీసులు అరెస్టు చేశారు.

భూ కబ్జాలు, అక్రమ కట్టడాలకు పాల్పడుతుండడంతో నెరేడ్‌మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని మల్కాజ్ గిరి MLA మైనంపల్లి హనుమంతరావు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఇక బంజారాహిల్స్ నుంచి రెండోసారి గెలిచిన TRS పార్టీ జనరల్ సెక్రటరీ KK కూతురు గద్వాల విజయ లక్ష్మి.. గతంలో GHMC అధికారులతో తాజాగా షేక్‌పేట తహశీల్దార్‌తో గొడవకు దిగి వార్తల్లోకి ఎక్కారు.

చిలుకానగర్ డివిజన్ నుంచి నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త బన్నాల ప్రవీణ్.. అతని అనుచరులతో వీరంగం సృష్టించారు. కొత్తగా కార్పొరేటర్‌గా ఎన్నికై 10 రోజులు కాకముందే చిలుకానగర్‌లోని శ్రీనివాస హైట్స్‌కు వెళ్లి వీరంగం సృష్టించారు.

గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగురవేసే విషయంలో చందా నగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ నవత రెడ్డికి, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి మధ్య గొడవ జరిగింది. సిట్టింగ్ కార్పొరేటర్ ఎగరవేసిన జెండాని తీసి పక్కన పడేసిన కొత్త కార్పొరేటర్ మళ్లీ జెండా ఎగురవేసారు. ఫిబ్రవరి 10 వరకు తనకే కార్పొరేటర్‌గా అధికారం ఉందని రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు సిట్టింగ్ కార్పొరేటర్ నవతా రెడ్డి. అంతే కాదు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే జామ్‌బాగ్ డివిజన్ నుంచి గెలిచిన BJP కార్పొరేటర్‌పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జామ్‌బాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన బిజెపి అభ్యర్థి రాకేష్ జైస్వాల్‌కు ముగ్గురు సంతానం ఉంటే ఇద్దరు సంతానమే ఉన్నారంటూ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని, రాకేష్ జైస్వాల్ ఎన్నిక చెల్లదని ఎంఐఎం అభ్యర్థి జడల రవీందర్ కోర్టును ఆశ్రయించారు. MIM అభ్యర్థిపై 82 ఓట్ల తేడాతో గెలిచిన రాకేష్ జైస్వాల్.. ఫిబ్రవరిలో అసలు ప్రమాణ స్వీకారం చేస్తారో లేదో చూడాలి.

ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మున్సిపల్ మంత్రి KTR సమక్షంలోనే BJP,TRS కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు శిలాఫలకంపై పెట్టలేదని, మీటింగ్‌కు, ఓపెనింగ్‌కు తమని పిలవలేదని BJP నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఆందోళనలు చేశారు. మొత్తానికి బల్దియా కార్పొరేటర్లలోని కొందరు.. ఇలా వివాదాల జోలికి వెళ్తూ చివరికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story