ఆ అస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలపై ప్రయోగిస్తోన్న బీజేపీ

ఆ అస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలపై ప్రయోగిస్తోన్న బీజేపీ
ఇదే అస్త్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్‌ఎస్‌ అసలు స్వరూపాన్ని ఎండగడతామని అంటున్నారు బీజేపీ నేతలు.

జీహెచ్ఎంసీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా టీఆర్ఎస్‌పై మాట‌ల యుద్ధం మొదలు పెట్టింది బీజేపీ.. గ్రేట‌ర్ ఎన్నిక‌లకు ముందు టీఆర్ఎస్ నేత‌లు చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నదేంటంటూ నిలదీస్తున్నారు. మేయర్‌ ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు త‌మ అభ్యర్థులను బరిలో దింపుతాయ‌ని అంతా భావించగా.. అనూహ్యంగా ఎంఐఎం చివ‌రి నిమిషంలో త‌మ అభ్యర్థిని బరిలో దించ‌కుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటేసింది. ఈ పరిణామంపై బీజేపీ నేత‌లు భగ్గుమంటున్నారు. తాము మొద‌టి నుంచి అనుమానిస్తున్న విధంగానే టీఆర్ఎస్ ఎంఐఎం స‌పోర్ట్ తీసుకుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం లేకుడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేద‌ని విమ‌ర్శిస్తున్నారు బీజేపీ నేత‌లు.

టీఆర్ఎస్ ఎంఐఎం అంతర్గత పొత్తును బ‌హిర్గతం చేయ‌డ‌మే లక్ష్యంగా బీజేపీ పావులు క‌దిపింది. తాము కూడా మేయ‌ర్ ఎన్నిక‌ల బరిలో ఉండ‌బోతున్నామ‌ని ప్రకటించిన బీజేపీ అందుకు తగినట్టుగానే అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రూట్ మార్చాయి. రెండు పార్టీలు ఒక్కటై మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాయి. టీఆర్ఎస్ ఎంఐఎం మేయ‌ర్ అభ్యర్థిని బరిలో దింపుతామ‌ని మొద‌టి నుంచి చెబుతూ రావ‌డంతో ఫ్లోర్ లో ఏవైనా అనూహ్య ప‌రిణామాలు జ‌రిగితే త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేసింది.

అయితే ఆ రెండు పార్టీలు ఒకరికి ఒక‌రు స‌హ‌క‌రించుకోవ‌డంతో బీజేపీ ప్లాన్ స‌క్సెస్ అయ్యింద‌న్న భావ‌న‌లో ఉన్నారు ఆ పార్టీ నేత‌లు. ఇక టీఆర్ఎస్‌ తీరును ప్రజా క్షేత్రంలో ఎండ‌గ‌ట్టేందుకు మ‌రో అవ‌కాశం దొరికింద‌ని భావిస్తోంది బీజేపీ. ఎన్నిక‌ల ముందు ప్రజల ఓట్లను రాబ‌ట్టుకోవ‌డానికి పొత్తులేద‌ని చెబుతున్న రెండు పార్టీలు ప‌ద‌వుల కోసం ఒక్కటై పోతున్నాయంటూ విమ‌ర్శిస్తున్నారు.

మేయర్ పదవి కోసం ఎంఐఎంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ తరహాలోనే నాగార్జునసాగర్‌లోనూ కేసీఆర్‌ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

మేయర్‌ ఎన్నికలో టీఆర్ఎస్ మోసం చేసిందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమ‌ర్శించారు. ప్రజలను మోసం చేసేందుకు ఎన్నిక‌ల్లో ఓ మాట చెబుతూ ఎన్నిక‌ల ఆ తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్ చర్యలు ఆ పార్టీనేతలకు తలనొప్పిగా మారాయని.. ఇక టీఆర్‌ఎస్‌లో ఎవరుంటారో బయటకు వస్తారో వారే తేల్చుకోవాలంటున్నారు.

మొత్తంగా ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇదే అస్త్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీఆర్‌ఎస్‌ అసలు స్వరూపాన్ని ఎండగడతామని అంటున్నారు.. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్‌ నాడు ప్రజల్లో ఉద్యమజ్వాల రగిలించగా.. అదే అస్త్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలపై ప్రయోగిస్తోంది బీజేపీ.

Tags

Read MoreRead Less
Next Story