Private Travels: సంక్రాంతి సీజన్.. ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీ

Private Travels: సంక్రాంతి సీజన్.. ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీ
Private Travels: సంక్రాంతి పండుగకు హైదరాబాద్​నుంచి ఏపీతో పాటుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు క్యూ కడుతున్నారు.

Private Travels: సంక్రాంతి పండుగకు హైదరాబాద్​నుంచి ఏపీతో పాటుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. అయితే చార్జీల్లో సెస్‌ల పేరుతో తెలంగాణ ఆర్టీసీ భారీ ఎత్తున ఛార్జీలు పెంచిన నేపధ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఓ రేంజ్‌లో దోచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇదే తంతు. పండక్కి సొంతూళ్లకు వెళ్లి.. ఓ నాల్రోజులు తమవాళ్లతో గడుపుదామనుకుంటే.. ఆ ప్రయాణాన్ని పీడకలలా మార్చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్.



ఆర్టీసీ బస్సులు చాలవు. ప్రైవేట్ దోపిడీ మామూలుగా లేదు. మరి ప్రయాణికుల పరిస్థితేంటి? పండుగల సమయంలో కంటే.. సొంతూళ్లకు మామూలు రోజుల్లో వెళ్లడం బెటరేమో అని ప్రజలు అనుకునేలా చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఇదో పెద్ద దందాలా తయారైంది. ఆర్టీసీ బస్సులేమో సరిపోవు. రైళ్లు ఖాళీ ఉండవు. ప్రయాణికులు వేరే దారి లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఏటికేడు భారీగా ఛార్జీలు దండుకుంటూ.. దోపిడీని కొనసాగిస్తూ.. ప్రైవేట్ ట్రావెల్స్.. మాఫియాలా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈ సంవత్సరం కొన్నిచోట్ల 14, 15, 16న భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటుంటే.. మరికొన్ని చోట్ల 15, 16, 17న పండుగ జరుపుకుంటున్నారు. అందువల్ల ఏపీకి చెందిన కర్ణాటకలో ఉంటున్న చాలా మంది.. ఏపీకి వెళ్లేందుకు ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. 11,12,13 తేదీల్లో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ట్రావెల్స్.. ఛార్జీల రేట్లను డబుల్ చేసేశాయి. సాధారణ ఛార్జీల కంటే ఏసీ స్లీపర్‌లో ఒక్కో బెర్తుకీ 800 నుంచి 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. అలాగే ఏసీ సీటర్‌లో 700 నుంచి 800 రూపాయలు ఎక్స్‌ట్రా ఛార్జ్‌ చేస్తున్నాయి. నాన్‌ ఏసీ స్లీపర్‌లో 800 దాకా పెంచేశాయి. నాన్‌ ఏసీ సీటర్‌కి 600 నుంచి 800 బాదేస్తున్నాయి.


ఈ సంవత్సరం దోపిడీ మామూలుగా లేదు. కరోనా పోయింది కదా. ఎలాగూ సొంతూళ్లకు భారీగా వెళ్తారని అనుకున్న ప్రైవేట్ ట్రావెల్స్... దోచుకో నా రాజా అన్నట్లు చెలరేగిపోతున్నాయి. ప్రయాణికులను నిలువునా ముంచేస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఏ బస్సు ఎక్కినా ఇదే తంతు. ఏసీ, నాన్‌ ఏసీ, సీటింగ్‌, స్లీపర్‌ అన్నింట్లోనూ ఛార్జీల రేట్లను డబుల్ చేసేశాయి. ఇంతలా దోచేస్తుంటే ఆర్టీఓ, రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. ప్రైవేట్ ట్రావెల్ నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకొని సైలెంటైపోతున్నారనే వాదన వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story