సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు...!

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు...!
హైదరాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తుండగా.. నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా కనబడుతోంది.

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి.. హైదరాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తుండగా.. నల్గొండ స్థానంలో టీఆర్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా కనబడుతోంది.. ప్రధాన అభ్యర్థుల మధ్య ఓట్ల సంఖ్య స్వల్పంగానే ఉండటంతో మొదటి ప్రాధాన్యతా ఓట్లతో గట్టెక్కే అవకాశం కనిపించడం లేదు.. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లపైనే అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్లతో తమ గెలుపు ఖాయమని సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానంతోపాటు.. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం గ్రాడ్యుయేట్‌ స్థానానికి కౌంటింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతోంది.. ఇప్పటి వరకు నల్గొండలో నాలుగు రౌండ్లు పూర్తికాగా.. మరో మూడు రౌండ్లు మిగిలివున్నాయి.. ఇక హైదరాబాద్‌లో మూడో రౌండ్‌ ఫలితం వెలువడాల్సి ఉంది.. మరో నాలుగు రౌండ్లు పూర్తిచేయాల్సి ఉండగా.. ఒక్కో రౌండ్‌కు ఐదారు గంటల సమయం పడుతోంది.

నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే నాలుగు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 63వేలా 442 ఓట్లు వచ్చాయి.. మరో మూడు రౌండ్లలో భారీ మెజార్టీ వస్తుందనుకున్నా... అంతా కలిపి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు.. ఇక రెండో స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కొనసాగుతున్నారు.. నాలుగు రౌండ్లలో ఆయనకు 48 వేలా 4 ఓట్లు పోలయ్యాయి.. మూడో స్థానంలో ఉన్న టీజేఎస్‌ అభ్యర్థి కోదండరామ్‌కు నాలుగు రౌండ్లలో కలిపి 39వేలా 605 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో మిగిలివున్న మూడు రౌండ్లలో భారీ మెజారిటీ వచ్చినా తొలి ప్రయారిటీ ఓటుతో ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు.

మరోవైపు రెండుచోట్లా ప్రస్తుతం నడుస్తున్న ఆధిక్యాలను బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లపైనే అందరి దృష్టి పడింది. రెండో ప్రాధాన్యతా ఓట్లతోనైనా గెలుస్తామనే ఆశ ప్రధాన అభ్యర్థుల్లో కనబడుతోంది. సరళి మారుతోందని, రెండో ప్రాధాన్యతా ఓటుతో తాను కచ్చితంగా గెలుస్తానని హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ధీమాగా చెబుతున్నారు.

ఇక ఒకవేళ రెండో ప్రాధాన్యతా ఓట్లలో కూడా ఫలితాలు రాకపోతే.. ఎలిమినేషన్ వరకు చూడాల్సిందే. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు తర్వాత ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది.. అప్పుడు అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను మినహాయించి లెక్కింపు చేపడతారు. దీంతో తుది ఫలితాలను వెల్లడించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story