గెలుపోటములకు గ్రేటర్ ఎమ్మెల్యేలు, మంత్రులదే బాధ్యత : కేసీఆర్

గెలుపోటములకు గ్రేటర్ ఎమ్మెల్యేలు, మంత్రులదే బాధ్యత :  కేసీఆర్

తాజా రాజకీయ పరిణామాలు సహా వివిధ అంశాలపై చర్చించేందుకు... నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రం 52 వేల 750 కోట్ల ఆదాయం కోల్పోతున్నందున.. మరోసారి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధరించడంపై చర్చించనున్నారు. ఏయే పథకాలకు ఎంత ఖర్చు పెట్టాలనే విషయంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ధాన్యం కొనుగోలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ధరణి వెబ్‌సైట్ లోటుపాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపైనా సమీక్షించనున్నారు.

దుబ్బాక ఉపఎన్నికల ఫలితంపై సీఎం కేసీఆర్ గురువారం ప్రత్యేక‌ సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శుల్ని ప్రగతి భవన్‌కు పిలిపించారు. ఓటమికి గల కారణాలపై చర్చించారు.

దుబ్బాక ఫలితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపకుండా పని చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్.. ఈ సారి వంద స్థానాల్ని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించాలని, సర్వే చేసి గెలుపు అవకాశాలు ఉన్న నేతల్నే బరిలోకి దించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉన్నందున... వరద బాధితులకు పరిహారం త్వరగా అందించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారీగా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. బూతుల వారీగా కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేయాలని సూచించారు.

టీఆర్ఎస్-ఎంఐఎం మైత్రిని బూచిగా చూపించి.. టీఆర్‌ఎస్‌కు ఓట్లు పడకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లబోతోందని, అటువంటి వ్యూహాలను తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్‌ సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, విశ్వనగరంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేసిన పనుల్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. గెలుపోటములకు గ్రేటర్ ఎమ్మెల్యేలు, మంత్రులదే బాధ్యత అని కేసీఆర్‌ తేల్చి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story