CM KCR Meeting : అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం!

CM KCR Meeting : అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం!
CM KCR Meeting : అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR). ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. వచ్చే సోమవారం ఉదయం పదకొండున్నరకు ప్రగతి భవన్‌(Pragati Bhavan)లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్‌లో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీ శాఖల్లోని ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ ఈమధ్య సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11వ తేదీ నాడు జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను మరోసారి చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు, పార్ట్-Bలో చేర్చిన అంశాల పరిష్కారం వంటి విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌(corona vaccination), కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. అన్ని ప్రాంతాలకు వ్యాక్సినేషన్‌తో పాటు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇవ్వడంపైనా కార్యాచరణ రూపొందిస్తారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును కూడా సమీక్షిస్తారు. గ్రామాలకు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా లేదా, వాటి వినియోగం ఎలా ఉంది వంటి అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షిస్తారు సీఎం కేసీఆర్. హరితహారం, గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా అధికారులతో చర్చించనున్నారు.

విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలనే అంశంపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుంచి క్లాసులు పెట్టాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశానికి కలెక్టర్లు, అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story