TPCC: ఎన్నికల సంఘానికి నేడు కాంగ్రెస్‌ ఫిర్యాదు

TPCC: ఎన్నికల సంఘానికి నేడు కాంగ్రెస్‌ ఫిర్యాదు
గెలిచిన తర్వాత వ్యూహంపై నేడు వార్‌ రూం భేటీ... ఫుల్‌ జోష్‌లో హస్తం శ్రేణులు...

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సానుకూలంగా ఉండడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. ఇప్పటికే తదుపరి కార్యాచరణకు కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఆర్థికపరమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కలిసి కాంగ్రెస్‌ ఇవాళ ఫిర్యాదు చేయనుంది. మరోవైపు ఎన్నికల లెక్కింపు పూర్తై ఫలితాలు వెలువడగానే ఎమ్మెల్యేల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇవాళ ఏఐసీసీ నాయకులతో రాష్ట్ర నాయకత్వం చర్చించి ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.


శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఎక్కువగా కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నాయి. ప్రముఖ ప్రాంతీయ, జాతీయ ఎగ్జిట్ పోల్స్‌ సంస్థలు.. తమ అంచనాల్లో దాదాపు 80 శాతం హస్తానిదే అధికారమని తేల్చాయి. ఈ తరుణంలో ప్రస్తుత ప్రభుత్వ కార్యకలాపాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదేవిధంగా అసైన్డ్‌ భూములను ధరణిలో బినామీల పేర్ల మీదకు మార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.


ఇదే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... సీనియర్ నాయకులతో మంతనాలు జరిపారు. రాజ్యాంగ నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పరిధిలో ఉండగా ప్రస్తుత ప్రభుత్వం విధానపర, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. ఇవాళ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోకుండా నియంత్రించాలని ఈసీని కోరనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వార్‌ రూం నుంచి కాంగ్రెస్‌ దిశానిర్దేశం చేసింది. గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి అందుకోగానే హైదరాబాద్ రప్పించే యోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాజ్ కృష్ణాలో వారందరితో సమావేశమై... అధిష్ఠానం సూచనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని.. స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. పలువురు అభ్యర్థులు, నాయకులు జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ సారథి రేవంత్‌ నివాసానికి వచ్చి ఆయనను కలిశారు. తమ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని తెలియజేశారు. ఎగ్జిట్‌పోల్స్‌పై చర్చించిన నేతలు అధికారం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story