TG: 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం

TG: 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం
సభలు, ర్యాలీలతో ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్‌... మంత్రులు, ఎమ్మెల్యేల విస్తృత ప్రచారం

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాల్లో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో చురుగ్గా కదులుతున్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. 17 ఎంపీస్థానాలకు కనీసం 14కి తగ్గకుండా గెలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో అడుగడుగునా.. గ్యారంటీల అమలును వివరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారజోరు పెంచింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు గడ్డం వివేక్‌, వినోద్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాక వెంకటస్వామి మనవడు వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. పేదల అభ్యున్నతి కోసం పనిచేసే తమ లక్ష్యాన్ని ఎవరూ ఆపలేరని, విమర్శించే వారిని పట్టించుకునే అవసరం లేదని విపక్ష నాయకులకు మంత్రి శ్రీధర్‌బాబు చురుకలు అంటించారు.


మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్, కాకగూడ, పికెట్, లక్ష్మీనగర్‌లో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్‌తో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌ పథకాలను వివరించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే..కంటోన్మెంట్‌ అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తామని హామీ ఇచ్చారు. పార్టీకి కంచుకోటగా ఉన్న భువనగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. భారాస పనిఅయిపోంది...మతం పేరుతో వచ్చే భాజపాను ఎవరూ నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలకు చేసిందేమీ లేదని... అన్ని వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆరోపించారు. ఆలేరులో భువనగిరి లోక్‌సభ సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన.. చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.

చేవెళ్ల లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తరఫున ఆయన సతీమణి సీతారెడ్డి రామకృష్ణాపురం డివిజన్‌లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి విశేషణ ఆదరణ వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... ఐదేళ్లలో అర్వింద్‌ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అనంతరం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో ముచ్చటించారు..

Tags

Read MoreRead Less
Next Story