Campaign: గడువు ముగుస్తున్న వేళ ప్రచార జోరు

Campaign: గడువు ముగుస్తున్న వేళ ప్రచార జోరు
వాడవాడలా రాజకీయ పార్టీల ప్రచారం.... ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం

తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీలతో వాడవాడా తిరుగుతున్నారు. ఓటర్లను పేరు పేరునా పలకరిస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే అధికార పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రచారానికి మరో ఏడు రోజులే మిగిలి ఉండటంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరికెపూడిగాంధీ ఇస్త్రీ చేస్తూ, బ్యాండ్ కొడుతూ ప్రచారం నిర్వహించారు.


ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాస్కీ సాధారణ ప్రయాణీకుడిగా మెట్రోలో ప్రయాణం చేసి ఓటర్లను కలిశారు. కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నెల మారేడ్‌పల్లి ప్రాంతంలోని కాలనీ, బస్తీలలో ఓట్లు అభ్యర్థించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు BSP అభ్యర్థి నీలం మధు ప్రచారంలో భాగంగా పాశమైలారం గ్రామంలో పలు దేవాలయాలను దర్శించుకొని రోడ్ షో నిర్వహించారు. కుత్బుల్లాపూర్‌లో ప్రచారం చేపట్టిన భారాస అభ్యర్థి కేపి వివేకానంద్..మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేష్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తమ గెలుపుకు చిహ్నమని ఖైరతాబాద్‌ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయరెడ్డి ప్రచారానికి తెలంగాణ టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి విజయరెడ్డి నివాళులర్పించారు.


ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి చెప్పులు కుట్టారు. టీ కొట్టు వద్ద టీ చేసి కార్యకర్తలకు అందించారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యకు మద్దతుగా తుమ్మలనాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలేరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు.


పాలేరులో CPM అభ్యర్థి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు తండాలలో ప్రచారం నిర్వహించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధనిక రాష్ట్రాన్ని పేదల రాష్ట్రంగా చేసిన కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ఇంటింటికి తిరిగి కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. రామగుండం సింగరేణి సంస్థ GDK 11 బొగ్గు గనిలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story