KCR: నేడు కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల కదనభేరీ

KCR: నేడు కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల కదనభేరీ
కరీంనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం …. . మెజారిటీ ఎంపీ స్థానాలను గెలవడమే లక్ష్యం

కరీంనగర్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇవాళ లోక్‌సభ ఎన్నికల కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్‌ఎస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు కంచుకోట అయిన కరీంనగర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లకు గాను 12 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ.. 2023 లో మాత్రం చతికిలపడింది. కేవలం ఐదింటిని మాత్రమే అత్తెసరు మెజారిటీతో సాధించి ఉనికి చాటుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇవాళ కరీంనగర్‌ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.


వాస్తవానికి గత నెలలో నల్గొండ జిల్లాలో పెట్టిన సభ కృష్ణా నదీ జలాల వాటకు సంబంధించింది కాగా కరీంనగర్ కదనభేరీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ శంఖారావానికి నాందిగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్‌ నుంచి ప్రారంభించి KCR విజయం సాధించారని.. ఇదే సెంటిమెంట్‌తో SRR మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలోనూ 2019 ఎన్నికల్లో భారాస ఓటమి పాలైంది. KCRకు కుడిభుజంగా ఉన్న వినోద్ కుమార్ ఓటమితో ఢిల్లీ సంబంధాలకు బీటలు వారాయి. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయినా.. మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచి.. పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ.. కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కరీంనగర్ నుంచి కధన భేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి... సభ విజయవంతం చేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

నల్గొండ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా ముఖ్యమంత్రి , మంత్రులపై నిప్పులు చెరిగిన KCR CM రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ ఇంకా విడుదల కాకముందే.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం అనూహ్యా పరిణామాలకు దారి తీస్తోంది. భారాసకు చెందిన ఆదిలాబాద్‌, మంచిర్యాల జడ్పీఛైర్మెన్లు జనార్థన్‌ రాఠోడ్‌, నల్లాల ఓదెలు దంపతులు ఇప్పటికే పార్టీని వీడగా, తాజాగా సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడైన ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జీ జడ్పీఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు ఈనెల 14న కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారైంది. బీఆర్‌ఎస్‌ నుంచి బోథ్‌ ఎమ్మెల్యే టికెట్‌, ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎంపీ గోడం నగేష్‌ ఆదివారం భాజపాలో చేరారు. మరోపక్క కీలకనేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరడానికి అంతర్గతంగా మంతనాలు జరుగుతుండటం భారాస రాజకీయ ప్రాభవాన్ని మసకబారేలా చేస్తోంది

Tags

Read MoreRead Less
Next Story