ఆధిక్యంలో వాణీదేవి, పల్లా.. గెలుపును డిసైడ్‌ చేయనున్న రెండో ప్రాధాన్యత ఓట్లు..

ఆధిక్యంలో వాణీదేవి, పల్లా.. గెలుపును డిసైడ్‌ చేయనున్న రెండో ప్రాధాన్యత ఓట్లు..
ఆ మెజార్టీ నిలుపుకుంటూ విజయం సాధిస్తారా..అనూహ్యంగా సెకండ్ ప్రిఫరెన్స్‌లో మార్పు జరుగుతుందా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్‌లో ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి ముందంజలో ఉన్నారు. తన సమీప అభ్యర్థి బీజేపీ నుంచి పోటీచేస్తున్న రామచందర్ రావుపై 6వేల 555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదు రౌండ్లలో వాణీదేవికి 88వేల 304 ఓట్లు రాగా.. రాంచందర్‌రావు కు 81వేల 749 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్ధి ప్రొ.నాగేశ్వర్‌కు 42 వేల 604 ఓట్ల రాగా.. కాంగ్రెస్ పార్టీనుంచి పోటీచేసిన చిన్నారెడ్డికి 24వేల 440 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఐదు రౌండ్లలో 16వేల 712 చెల్లని ఓట్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి TRSకే ఆధిక్యం కనిపిస్తోన్నా విజయం ఇప్పుడప్పుడే ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదు. TRS అభ్యర్థి సురభి వాణిదేవికి 36 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఐతే.. విజయం సాధించాలంటే ఇది సరిపోదు. మొత్తం పోలైన ఓట్లు 3 లక్షల 57 వేల 354 ఉంటే వాటిల్లో సగానికంటే ఒక్కటైనా ఎక్కువగా రావాలి. ఐతే.. ఇప్పటి వరకూ 5 రౌండ్లలో 2 లక్షల 80 వేల 30 ఓట్లు లెక్కించారు. ఇక లెక్కించాల్సినవి 77 వేల 310 ఓట్లు మాత్రమే. ఐతే.. ఇవన్నీ ఏకపక్షంగా TRSకు పడే అవకాశాలు లేవు కాబట్టి రెండో ప్రాధాన్యతకు వెళ్లాల్సిందే. అప్పుడు ఫలితం రావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

తొలి ప్రాధాన్యత ఓట్లలో ట్రెండ్ బట్టి చూస్తే TRSకు సరాసరిన 33 నుంచి 35 శాతం ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు రెండో ప్రాధాన్యతకు వెళ్లే అక్కడ ఓ 17 శాతం ఓట్లు సాధిస్తే సురభి వాణిదేవి విజయం ఖాయమవుతుంది. ఐతే.. సుదీర్ఘంగా సాగే ఓట్ల లెక్కింపులో తుది ఫలితం ఎలా ఉంటుంది. అనూహ్యంగా రెండో ప్రాధాన్యతలో అభ్యర్థుల తలరాతలు మారతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.

అటు.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కాసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. టీఆర్ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఒక లక్షా పది వేల 840 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. తీన్మార్ మల్లన్న 83 వేల 290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాం 70 వేల 72 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39 వేల 107 ఓట్లు వచ్చాయి. ఇందులో 21 వేల 636 ఓట్లు చెల్లకుండాపోయాయి.

ఇక రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వరకూ చూస్తే సమీప ప్రత్యర్థి మల్లన్నపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి 27 వేల 550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఆ మెజార్టీ నిలుపుకుంటూ విజయం సాధిస్తారా.. అనూహ్యంగా సెకండ్ ప్రిఫరెన్స్‌లో మార్పు జరుగుతుందా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story