Amit Shah Tour: అమిత్ షా టూర్: నిర్మల్‌ సభా వేదికగా తెలంగాణలో పట్టు సాధించేందుకు..

Amit Shah Tour: అమిత్ షా టూర్: నిర్మల్‌ సభా వేదికగా తెలంగాణలో పట్టు సాధించేందుకు..
ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్మల్‌లో భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ

Amit Shah Tour: ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్మల్‌లో భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరపాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్న కమలనాథులు.. ఇవాళ నిర్మల్‌ కేంద్రంగా మరోసారి ఆ వాదన గట్టిగా వినిపించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ కార్యక్రమామనికి ప్రత్యేకంగా హాజరవుతున్నారు. నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రి దగ్గర ఈ సభ జరగనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగానే అమిత్‌షా ఈ సభకు వస్తున్నారు. సెప్టెంబర్‌ 17కి తెలంగాణలో ప్రత్యేక ప్రాధాన్యం ఉండడంతో ఈ రోజు కలిసి వచ్చేలా ఈ సభను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో మరింతగా బలపడి సత్తా చాటాలని భావిస్తున్న BJPకి ఉమ్మడి ఆదిలాబాద్‌లో కొంత పట్టుంది. దాన్ని పటిష్టం చేసుకునేలా వ్యూహాత్మకంగా నిర్మల్‌ను సభా వేదికగా చేసుకున్నారు. తెలంగాణలో KCR పాలన నిజాంను తలపిస్తోందని ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కమలనాథులు.. ఇవాళ్టి సభ వేదికగా మరింతగా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిత్రకంగా నిర్మల్‌లోని వెయ్యి ఉరులమర్రికి ప్రాధాన్యత ఉండటంతో.. ఇక్కడే సభ పెట్టాలని బీజేపీ నిర్ణయించి భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సభ వేదికగా షా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాటి స్వాతంత్రోద్యమ పోరాటంలో నిర్మల్‌ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. నిర్మల్‌ అంటే కేవలం కొయ్యబొమ్మలు, కోటబురుజులు మాత్రమే కాదు. వాటిని మించిన సాహసోపేతమైన వీరుల చరిత్రకు నిదర్శనం. బ్రిటీషర్లు, హైదరాబాద్‌ నవాబులను ఏకకాలంలో ఢీకొట్టి, ముప్పతిప్పలు పెట్టిన ఘనత ఇక్కడి వీరులది. అధునాతన ఆయుధాలు లేకున్నా.. శక్తియుక్తులతో శత్రువులకు చుక్కలు చూపించారు. 1857లో జరిగిన ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఘనతా వీరికి ఉంది.

ఈ పోరాట క్రమంలో 1860లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీ గోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ.. చెల్లాచెదురుగా ఉన్న స్థానిక సేనల్ని ఏకం చేసి గెరిల్లా తరహా పోరాటాలు చేశారు. చివరికి రాంజీని దొంగదెబ్బ తీసిన ఆంగ్లేయులు వారిని పట్టుకొచ్చి నిర్మల్‌ నుంచి ఎల్లపెల్లికి వెళ్లే మార్గంలోని మహా మర్రిచెట్టుకు ఉరి తీశారు. రాంజీ గోండు సహా వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. జనరల్ డయ్యర్ జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే యాభయ్యేళ్ల ముందే ఈ ఘటన జరిగింది. అలా వెయ్యిమంది వీరుల బలిదానానికి సజీవ సాక్షమైన మహా మర్రిచెట్టుకే 'వెయ్యి ఉరుల మర్రి'గా పేరొచ్చింది. కొన్నేళ్ల క్రితం ఆ మర్రిచెట్టు గాలివానకు నేలకొరిగినా.. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా మర్రిచెట్టు సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు.

ఇవాళ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు అమిత్‌షా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి పదకొండున్నర గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌ విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని.. మధ్యాహ్నం రెండున్నర కల్లా నిర్మల్ చేరుకుంటారు. నిర్మల్ సభా ప్రాంగణంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. అనంతరం సర్దార్‌ పటేల్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story