స్కూల్ గేటు దాటి క్లాసులోకి ఎంటరైన కరోనా.. విద్యా సంస్థలు మూసివేసిన సర్కార్

స్కూల్ గేటు దాటి క్లాసులోకి ఎంటరైన కరోనా.. విద్యా సంస్థలు మూసివేసిన సర్కార్
బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్‌లో విజృంభిస్తున్న కోవిడ్‌ వైరస్.. ఈసారి స్కూల్స్, కాలేజీలను తాకింది. గత కొద్ది రోజులుగా అంతకంతకు పెరుగుతున్న కరోనా స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజమాబాద్ ఇలా అన్ని జిల్లాల్లోను కరోనా వేగంగా వ్యాపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మెడికల్ కాలేజీలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, గురుకుల విద్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యాసంస్థలు కరోనా విస్పోటన కేంద్రాలుగా మారిన నేపథ్యంలో విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. పిల్లల తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు యథాతథంగా నడుస్తాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేసింది. దేశంలోని రాష్ట్రాల పరిస్థితులను వివరించిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయా స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో దాదాపు 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా స్కూళ్లు, గురుకులాల్లో రోజురోజుకు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. కోవిడ్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తే మంచిందని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్ని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు.

ఇక తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 68 వేల171 కరోనా టెస్టులు చేయగా.. 412 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఒక వెయ్యి 674కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 216 మంది కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 వేల 151 ఉన్నాయి. వీరిలో ఒక వెయ్యి 285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు వెలుగుచూడగా.. గాంధీ ఆస్పత్రిని మరోసారి కోవిడ్ హాస్పిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే టిమ్స్ ఆస్పత్రిని సైతం పూర్తిగా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. రెమిడిస్వేర్ వంటి మెడిసన్ అందుబాటులో ఉంచాలని అన్ని జిల్లా అధికారులను వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఇదిలా ఉంటే.. అన్‌లాక్‌లో భాగంగా గతేడాది జూన్ 7న తెలంగాణ ప్రభుత్వం సడలింపులు చేసింది. జూన్ 30వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో దశలవారీగా లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక మాల్స్, హోటల్స్ రెస్టారెంట్లలో డైనింగ్ ఫెసిలిటి, సినిమా హాల్స్‌లలో 50శాతం ఆక్యుపెన్సీ ఇస్తూనే, జిమ్, ఆడిటోరియం, ఫంక్షన్ హాల్స్‌పై విధించిన నిషేధాలను ఎత్తివేసింది. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధిస్తుందా లేదా అనేది చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story