Telangana : తెలంగాణాలో స్టాఫ్ నర్స్ తుది ఫలితాలు విడుదల

Telangana : తెలంగాణాలో స్టాఫ్ నర్స్ తుది ఫలితాలు విడుదల

తెలంగాణలో నర్సింగ్ సిబ్బంది నియామకానికి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఫలితాలను TS హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31న నియామక పత్రాలు అందజేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.

డిసెంబర్ 2022లో తెలంగాణలో 5,204 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 2న పరీక్ష జరిగింది. అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 1,890 నర్సింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodhar rajanarsimha) ఆదేశాల మేరకు ఈ పోస్టులను ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌కు (Recruitment) చేర్చారు. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 7,094కి చేరింది.

MHSRB గత నెలలో తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసింది. అనంతరం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. అయితే నర్సింగ్‌ సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌పై తీవ్ర గందరగోళం నెలకొంది. మెరిట్ లిస్టులో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోఠిలోని మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అతి తక్కువ కన్వర్షన్లు పొందిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు. MHSRB వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలో తాజాగా కటాఫ్ ర్యాంకులు, తుది మెరిట్ జాబితా, ఎంపిక జాబితాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ విడుదల చేసింది. ఇవి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

చెక్ చేసుకోండి ఇలా..

అభ్యర్థులు ముందుగా https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. అక్కడ, హోమ్ పేజీలో, నర్స్ రిక్రూట్‌మెంట్ స్టాఫ్ షార్ట్‌లిస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థుల జాబితాతో ఒక PDF వెంటనే ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ పేరు సరిచూసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story