RESULT: ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

RESULT: ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం
రేపు ఉదయం పదిన్నరకే తొలి ఫలితం... ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ రేపు(ఆదివారం) వీడనుంది. నెలరోజుల విస్తృత ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయనుండగా 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఓట్లు లెక్కించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఒకే చోట కేంద్రం ఉండగా.. మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.


ప్రతి నియోజకవర్గంలో లెక్కింపు కోసం 14 చొప్పున టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి. తొలుత ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కీసరలోని హోలీ మేరీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి రాచకొండ CP చౌహాన్ పరీశిలించారు. లెక్కింపు సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆందోల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించే గీతం విశ్వవిద్యాలయం వద్ద మూడంచెల భద్రత కల్పించారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఉదయం పదిన్నరకే తొలి ఆధిక్యం తెలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story